
ప్రభుత్వంతో తీన్మార్ మల్లన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా ఫొటోలు ప్రసారం చేశారని, మరొకరితో సంబంధం అంటగట్టారని సదరు మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్యూ న్యూస్ ఆఫీసులో సోదాలు చేసి.. పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ డివైజ్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత మల్లన్న పోలీసు విచారణకు హాజరయ్యారు. అయితే.. విచారణ పేరుతో తనను గంటల తరబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారని మల్లన్న ఆరోపించారు. అన్యాయాలను ప్రశ్నించినందుకు, అక్రమాలను వెలికి తీసినందుకే తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా.. ధర్మం తనవైపే ఉందని అన్నారు. అవసరమైతే తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, అన్నారు. కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచీ బయటకు ఈడుస్తానని కూడా అన్నారు.
ఈ క్రమంలోనే మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను విచారణ పేరుతో వేధిస్తున్నారని, పదే పదే పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారని కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ మంగళవారం (ఆగస్టు 10) న్యాయస్థానం విచారణ చేపట్టింది.
కారణం లేకుండానే తనను స్టేషన్ కు పిలుస్తున్నారని, అలా పిలవకుండా.. ఆన్ లైన్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో కోర్టును కోరారు మల్లన్న. నవీన్ కుమార్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో.. ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుందనే చర్చ మొదలైంది.
ఇదిలాఉంటే.. కొంత కాలంగా తీన్మార్ మల్లన్న కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని తన యూట్యూబ్ చానల్ లో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే.. ఉన్నట్టుండి క్యూ న్యూస్ లోనే పనిచేసిన చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి మల్లన్నపై సంచలన ఆరోపణలు చేశారు. అటు ఓ మహిళ కూడా పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరి, ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.