Teenmar Mallanna: క్యూ న్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనపై టీఆర్ఎస్ ప్రభుత్వం పలు కేసులు పెట్టి రిమాండ్ కు పంపించడంతో ఆయనలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ని ఎదుర్కొనే క్రమంలో బీజేపీ అయితేనే బాగుంటుందని నిర్ణయించుకుని బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జ్యోతిష్యుడి ఆత్మహత్యాయత్నానికి తీన్మార్ మల్లన్న కారణమని పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఇంకా రిమాండ్ లోనే ఉంచారు. దీంతో ఆయనను జైలులోనే ఉంచేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా బయటకు రావాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ రెండో స్థానం సాధించి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. సామాజిక మాధ్యమం వేదికగా ప్రభుత్వ చర్యలను ఖండించారు. దీంతో ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టి జైల్లో పెట్టించింది. ప్రశ్నించే గొంతుకలను జైలులో పెట్టించడంపై అందరిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తన రాజకీయ మనుగడ కోసం ఏదైనా పార్టీలో చేరాలని భావించుకున్నట్లు తెలుస్తోంది. ఆది నుంచి తీన్మార్ మల్లన్నకు బీజేపీయే అండగా ఉందని సమాచారం. దీంతోనే ఆయన బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరితో వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
టీఆర్ఎస్ పై విమర్శలతో దాడి చేయడంతో అధికార పార్టీ తన ఉనికికే ప్రమాదం ఉందని గ్రహించి ఆయనను జైలు పాలు చేసింది. ఆయన అరెస్టు అయ్యాక బండి సంజయ్, వివేక్, అర్వింద్ సహా పలువురు నేతలు తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలబడ్డారు. దీంతోనే ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ముందుకు కదిలారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో దాని వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా ఎదగడానికి సరైన వేదిక బీజేపీ అనే భావంతోనే మల్లన్న బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. దీంతో బీజేపీకి కూడా బలం పెరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో, రాష్ర్టంలో పార్టీ బలోపేతం దిశగా చేపడుతున్న చర్యల్లో భాగంగానే తీన్మార్ మల్లన్నను చేర్చుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.