Kotam Reddy- Anam Ramanaraya Reddy: నెల్లూరు రాజకీయ రసకందాయంలో పడుతోంది. పార్టీపై తిరుగుబాటు చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన అనుచరులపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి పదవి లభించకపోవడంతో పాటు తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లేదని తొలిసారి గొంతెత్తిన కోటంరెడ్డి. తరువాత తన ఫోన్ ను ప్రభుత్వ పెద్దలు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. దీంతో వైసీపీ హైకమాండ్ అనుమానాపు చూపులు చూసింది. చంద్రబాబును నేరుగా కోటంరెడ్డి కలిసిన తరువాత స్వరం పెంచారని భావించి.. ఆయనకు పక్కన నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకరరెడ్డిని తీసుకొచ్చారు. అయితే టీడీపీ ఇచ్చిన ధైర్యంతో తిరుగుబాటు బావుటా వేసిన కోటంరెడ్డికి టీడీపీ నుంచి సరైన రిప్లయ్ రాకపోవడంతో మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
అటు కోటంరెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ కి షాకిచ్చారు. అయితే ప్రభుత్వం అనుచరులపై కేసులు పెడుతున్న ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను చెబుతానని హెచ్చరిస్తున్నాయి. కానీ టీడీపీ అనుకున్నంతగా కోటంరెడ్డిపై సానుకూలత చూపలేదు. గత మూడున్నరేళ్లుగా తమను ఇబ్బందిపెట్టారంటూ మెజార్టీ కేడర్ ఆయన్ను శత్రువుగానే చూస్తోంది. కోటంరెడ్డి మాత్రం తాను టీడీపీ అభ్యర్థిగానే బరిలో దిగుతానని ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే కోటంరెడ్డి విషయంలో టీడీపీ హైకమాండ్ మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికే పరోక్షంగా సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. అటు కోటంరెడ్డితో పాటు ఆనం రామనారాయణరెడ్డికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తోంది. గత నాలుగేళ్లుగా నానా ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అటు ప్రారంభంలో ఉన్న ఆసక్తి టీడీపీ హైకమాండ్ నుంచి వారికి రావడం లేదు. దీంతో ఆ ఇద్దరి నాయకుల్లో టెన్షన్ పెరుగుతోంది.
మరోవైపు టీడీపీ కాకుంటే జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చాన్సిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే కోటంరెడ్డి, ఆనంలు మాత్రం అయితే టీడీపీ లేకుంటే జనసేనగా డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే వారు చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లిన తరువాత పార్టీలో ధిక్కార స్వరం వినిపించారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ బలోపేతంగా ఉన్నందున ఈ ఇద్దరి నాయకుల చేరికతో టీడీపీ బలపడుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వరకూ వారితో విమర్శలు చేయించి తరువాత పార్టీలో చేర్చుకొని చంద్రబాబు టిక్కెట్లు ప్రకటన చేస్తారన్న ప్రచారం పసుపుపార్టీలో వినిపిస్తోంది.