Vallabhaneni Vamsi: ఏపీలో కరుక్షేత్రం స్థాయిలో రణరంగం జరుగుతోంది. అన్ని పార్టీలకు గెలుపు ముఖ్యం. కొందరి నాయకులకు ప్రాణసంకటం. అందుకే సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మొహమాటాలకు పోకుండా బలమైన అభ్యర్థులను బరిలో దించి విజయాలను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. ఈ ఎన్నికల్లో గెలుపుపైనే ఆయన రాజకీయ జీవితం కొనసాగింపు ఆధారపడి ఉంది. అందుకే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. అటు కుమారుడు లోకేష్ తో పాదయాత్ర చేయించి.. తాను నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అటు పొత్తులపై కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలో తేవడంతో పాటు తనను అన్నివిధాలా ఇబ్బందిపెట్టిన నాయకులను ఓడించాలని డిసైడ్ అయ్యారు. కొడాల నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా లాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్న కసితో ఉన్నారు.

గుడివాడలో కొడాలి నాని ని ఓడించేందుకు చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బలమైన అభ్యర్థిని బరిలో దించి నానిని మట్టి కరిపించాలని చూస్తున్నారు. నందమూరి కుటుంబం పేరు చెప్పి ఎమోషన్ బ్లాక్ మెయిల్ తరహాలో మాట్లాడే నానికి.. అదే నందమూరి కుటుంబంతో దెబ్బ తీయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారు. నందమూరి వారసులను గుడివాడ నుంచి రంగంలో దించితే ఎలా ఉంటుందోనని ఆలోచన చేస్తున్నారు. అటు గుడివాడలో జనసేన గ్రాఫ్ బాగుంది. పవన్ అభిమానులు కూడా ఎక్కువ. వంగవీటి కుటుంబ అనుచరగణం అధికం. ఈ నేపథ్యంలో జనసేనకు సీటు అప్పగిస్తే మంచి ఫలితం వచ్చే చాన్స్ ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
గన్నవరంలో అధికార వైసీపీలో నెలకొన్న విభేదాలను క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వల్లభనేని వంశీ గెలుపొందారు. వైసీపీలోకి ఫిరాయించారు. అయితే అప్పటివరకూ వైసీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్న యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులో ఆందోళన ప్రారంభమైంది. ఆ ఇద్దరు నాయకులు వంశీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే వారిని వంశీ లైట్ తీసుకున్నారు. నాకు అధిష్ఠానంతో పని తప్పించి.. వారెవరు అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. వంశీ చేరిక నుంచి గన్నవరం జఠిలం కావడంతో చివరకు సీఎం జగన్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. వంశీ, వెంకటరావుల మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే ఇప్పుడు వంశీకి సీటు కన్ఫర్మ్ చేయడంతో వెంకటరావు మరో వర్గ నాయకుడు దుట్టా రామచంద్రరరావుతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు అసమ్మతి గళం వినిపించారు.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గద్దె రామ్మోహనరావును ప్రయోగించడానికి డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను సొంత నియోజకవర్గం నుంచి పోటీచేయించడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అటు వైసీపీ అసమ్మతి నాయకుడు యార్లగడ్డ వెంకటరావు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని చూస్తున్నారు. అదే జరిగితే వైసీపీలో ఓటు చీలి.. అంతిమంగా టీడీపీకి లాభిస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ఆ ఇద్దరు నేతలకు భరోసా కల్పించారని.. తెరవెనుక మంత్రాంగం కూడా పూర్తి చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.