
తెలంగాణలో టీడీపీ దుకాణం పూర్తిగా మూతపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా కప్పుకోవడంతో.. ఆ పార్టీకి శాసనసభలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలో రెండు స్థానాల్లో టీడీపీ గెలిచింది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. ఎన్నికలు జరిగిన తర్వాత కొన్నాళ్లకే సండ్ర వెంకటవీరయ్య గులాబీ గూటికి చేరారు. ఆ తర్వాత మెచ్చాకు సైతం గాలం వేయడంతో.. ఆయన ఇష్టపడలేదనే ప్రచారం సాగింది. కానీ.. ఇన్నాళ్లూ వేచి ఉన్న ఆయన.. చివరకు కారులోనే ఎక్కేశారు.
బుధవారం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మెచ్చా.. టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ పోచారానికి తెలిపారు. ఈ మేరకు సండ్ర వెంకటవీరయ్యతో కలిసి లేఖను కూడా అందజేశారు. దీంతో.. తెలంగాణలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా జంప్ అయిపోవడంతో.. అసెంబ్లీలో టీడీపీ అంతర్థానం అయ్యింది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నష్టపోయిన టీడీపీ.. ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయితే.. అలాంటి టైమ్ లోనూ చంద్రబాబు తెలంగాణ పార్టీపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇప్పుడు.. అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలోనే ఆయన భారీ సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ సర్కారును ఢీకొనలేక ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి టైమ్ లో తెలంగాణ పార్టీ గురించి ఆయన పట్టించుకునే అవకాశమే లేకుండాపోయింది.
మరోవైపు.. తెలంగాణ పార్టీని ఇక్కడి నేతలకే అప్పగిస్తున్నానని కూడా బాబు ప్రకటించారు. కానీ.. రాజకీయంగా పార్టీబలపడే పరిస్థితులు కనిపించకపోవడంతో ముఖ్యనేతలంగా తలోదిక్కుకు వెళ్లిపోయారు. తమ భవిష్యత్ కోసం వివిధ పార్టీల్లోకి వెళ్లిపోవడంతో.. నాయకత్వంలేని సైన్యంగా మారిపోయారు తెలుగు తమ్ముళ్లు. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఏనాడో పార్టీని వీడడంతో.. మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే కొనసాగుతూ వచ్చారు. ఆయన కూడా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయిపోవడంతో.. తెలంగాణలో టీడీపీ పేరు వినిపించడమే బందైపోయింది.
ఇప్పుడు.. ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరిపోవడంతో టీడీపీ దుకాణం పూర్తిగా మూసేసినట్టు అయ్యింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి రాష్ట్ర విభజనకు తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ.. నేడు అనామక స్థాయికి పడిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ లో టీడీపీఎల్పీని అధికారికంగా విలీనంచేయడంతో తెలంగాణలో టీడీపీ కథ ముగిసినట్టుగానే భావిస్తున్నారు.