TDP – NDA : తెలుగుదేశం ఎన్డీఏలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్ళింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్డీఏ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా అదే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్డీఏలోకి తిరిగి చేరాలని భావించింది. ఈ మేరకు బిజెపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ నెల 5న ఎన్డీఏలోకి టిడిపి అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. బిజెపి సైతం కలిసి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో టిడిపికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం.
కొద్దిరోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలతో సమావేశమయ్యారు. కీలక చర్చలు జరిపారు. వారి మధ్య సీట్ల ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం చంద్రబాబు పొత్తుల విషయంపై పెద్దగా మాట్లాడలేదు. దీంతో పొత్తులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎక్కువ సీట్లు బిజెపి అడగడం వల్లే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని అంతా భావించారు. అయితే ఈ విషయంలో పవన్ పట్టుబట్టి బిజెపి ఆగ్రనేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో వారు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాలుగా ఉంటూ వివిధ కారణాలతో దూరమైన పార్టీలను.. బిజెపి తిరిగి చేర్చుకుంది. నితీష్ కుమార్ తో పాటు కర్ణాటకలో కుమారస్వామి ఇప్పటికే ఎన్డీఏ గూటికి చేరారు. ఇప్పుడు చంద్రబాబును సైతం చేర్చుకునేందుకు బిజెపి ఆగ్రహం నేతలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామ్య పక్షంగా ఉండేది. గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా కూడా చంద్రబాబు వ్యవహరించారు. కానీ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలను సాకుగా చూపి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అయితే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తో జత కలిశారు. దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక ప్రచార సభలో పాల్గొన్నారు. దీంతో బిజెపి ఏపీలో టిడిపికి వ్యతిరేకపక్షంగా ఉన్న వైసీపీకి పరోక్ష మద్దతు ఇచ్చింది. వైసిపి అధికారంలోకి రావడానికి కారణమైంది. గత ఐదు సంవత్సరాలుగా వైసిపికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు సైతం ఎన్డీఏలో చేరేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా గట్టిగా ప్రయత్నం చేసేసరికి.. వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.
అయితే టిడిపి ఎన్డిఏ లో చేరే ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వెనువెంటనే టిడిపి ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ రూపొందించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఈ నెల ఐదున ముహూర్తం గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీతో తెలుగుదేశం సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని.. బిజెపికి మూడు పార్లమెంట్ స్థానాలు, ఐదు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి అంగీకరించినట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో పొత్తు ప్రకటన చేయాలని పవన్ నుంచి బిజెపికి ఒత్తిడి ఎదురవుతున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ నెల 5న టిడిపి ఎన్డీఏలో ఎంట్రీ లాంఛనమేనని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.