NTR Distict: ఏపీలో కొత్త జిల్లాలు ప్రకటించగానే అందరినీ ఆశ్చర్యపరిచింది ‘ఎన్టీఆర్ జిల్లా’. ఏపీ సీఎం జగన్ తన ప్రత్యర్థి పార్టీ అధినేత పేరును ఒక జిల్లాకు పెట్టడం నిజంగా ఎవ్వరూ ఊహించనది. జగన్ ఇలా చేస్తాడని బహుశా తెలుగుదేశం పార్టీ కూడా ఊహించలేదు. శత్రువైనా సరే ఆయన ఖ్యాతిని గుర్తించి జగన్ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఈ హఠాత్ పరిణామానికి ఎలా స్పందించాలో తెలియక పార్టీ అధినేత నుంచి కార్యకర్తల వరకూ ఈ విషయంలో అందరూ సైలెంట్ గానే ఉంటున్నారు.
ఇప్పటికే కొత్త జిల్లాలపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయవచ్చని జగన్ సర్కార్ ప్రజలకు, ప్రతిపక్షాలకు పిలుపునిచ్చింది. తాము పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే ఏపీలో ప్రతిదానికి జగన్ నిర్ణయాలను తప్పుపట్టి రచ్చ చేసే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి ఏమాత్రం స్పందించడం లేదు. కుక్కురుమనకుండా కుక్కిన పేనులా పడి ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి పార్టీ కార్యకర్తలు, నేతల వరకూ దీనిపై సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశమైంది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ రామారావు పేరును కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విజయవాడ జిల్లాకు పెట్టింది ఏపీ ప్రభుత్వం. కానీ టీడీపీ మాత్రం దీనిపై మౌనంగా ఉండడం గమనార్హం. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ నేతలు దీన్ని స్వాగతించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ పై తుపాకీ పెట్టి చంద్రబాబును, టీడీపీని కాల్చాలని జగన్ ఈ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వాసనలు లేకుండా.. ఆయన వారసులు లేకుండా పార్టీని హైజాక్ చేసి నడిపిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన ‘ఎన్టీఆర్ జిల్లా’ కక్కలేక మింగలేని వ్యవహారంగా మారింది. ఎన్టీఆర్ జిల్లాకు మద్దతుగా ఏం మాట్లాడినా.. వ్యతిరేకించినా చంద్రబాబుకు రాజకీయంగా మైలేజ్ డ్యామేజ్ అవుతుందని టీడీపీ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఏం మాట్లాడినా క్రెడిట్ జగన్ కే వెళుతుందని అందుకే చంద్రబాబు, లోకేష్ పార్టీ నేతలు మౌనం దాల్చారని సమాచారం.
ఈ క్రమంలోనే పార్టీ నేతలంతా మూకుమ్ముడిగా సైలెంట్ అవ్వడం వెనుక కారణం అదేనంటున్నారు. పోనీ చంద్రబాబు హైజాక్ చేశాడు సరే.. ఇన్నాళ్లు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చారని రచ్చ చేసిన నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఈ వ్యవహారంపై స్పందించకపోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి మాత్రమే స్వాగతిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇక కుమారుడు కం ఎమ్మెల్యే బాలక్రిష్ణ స్పందించలేదు. హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా నోరుమెదపలేదు.
టీడీపీ , నందమూరి ఫ్యామిలీ చేపట్టే ఏ కార్యక్రమం అయినా.. ఎన్టీఆర్ పేరు లేకుండా జరగదు.అ లాంటిది ఒక జిల్లాకు పేరు పెడుతున్నా వీరంతా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.