Galla Jayadev: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి ఎందుకు నిష్క్రమించినట్టు? ఎన్నికల ముంగిట ఈ నిర్ణయం ఎందుకు? నిజంగా ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డారా? లేకుంటే మరో రకమైన ఒత్తిడి ఉందా? తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నమ్ముతున్న వేళ ఈ నిర్ణయం ఏమిటి? బిజెపి, టిడిపి కలుస్తాయి అనుకుంటున్న తరుణంలో ఈ ట్విస్ట్ ఎందుకు ఇచ్చారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గుంటూరు ఎంపీగా గత రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్న వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడం తప్పులేదు కానీ.. నెపాన్ని కేంద్ర ప్రభుత్వం పై పెట్టడమే కాస్త అభ్యంతరకరంగా ఉంది.
గల్లా కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది. జయదేవ్ తల్లి అరుణకుమారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి మరణం, రాష్ట్ర విభజనతో టీడీపీ వైపు అడుగులు వేశారు. చంద్రబాబుతో మంచి అనుబంధం పెంచుకున్నారు. అందుకే కీలకమైన గుంటూరు లోక్ సభ స్థానాన్ని జయదేవ్ కు చంద్రబాబు కట్టబెట్టారు. అయితే చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా జయదేవ్ బాగా కష్టపడ్డారు. ఎంపీగా మంచి మార్కులే దక్కించుకున్నారు. అయితే ఆయన రాజకీయ నిష్క్రమణ మాత్రం అంతు పట్టడం లేదు. ఆయన చెబుతున్న కారణాలు సహేతుకంగా కనిపించడం లేదు. తనకు కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని.. ఈడి రెండు సార్లు పిలిచిందని.. అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని జయదేవ్ ప్రకటించారు. అయితే పరిశ్రమల నిర్వహణలో తప్పు ఉంటే కదా ఈడీ పిలిచేది? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని జయదేవ్ తో పాటు కీలక నేతల నమ్మకం. అటువంటప్పుడు పార్టీని ఎందుకు వీడాల్సి వస్తోందన్న ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికే టిడిపితో బిజెపి కలవనుందని ఈ నేతలే చెబుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తుంది… మరోవైపు కేంద్రంలో గెలవబోయే ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతుంది అని నమ్మకంగా చెబుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తూ జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించడం మాత్రం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం విపక్షంలో ఉన్నప్పుడు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. జయదేవ్ రాజకీయాల నుంచి దూరం కావడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. రేపు ఎలాగూ అధికారంలోకి వస్తుందన్న ధీమా ఉంది. అప్పటివరకు పార్టీలో కొనసాగవచ్చు కదా? ఆ తరువాత రాజకీయాల నుంచి నిష్క్రమించవచ్చు కదా? తాను రాజకీయాల నుంచి వెళ్తున్నానని.. ఫుల్ టైం రాజకీయాలు చేయాలనిపిస్తే వస్తానని జయదేవ్ చెబుతున్నారు. అదే సమయంలో జయదేవ్ వస్తానంటే పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని లోకేష్ చెబుతుండడం మరీ విడ్డూరంగా ఉంది. జయదేవ్ కేవలం రాజకీయాలనుంచి బయటకు వెళ్లిపోయారే తప్ప.. తెలుగుదేశం పార్టీ నుంచి కాదన్న విషయం లోకేష్ తెలుసుకోవాలి. మొత్తానికైతే జయదేవ్ నిష్క్రమణ గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. కానీ అటు జయదేవ్ కు, ఇటు టిడిపి నాయకత్వానికి మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది.