
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు దగ్గరౌతున్న సమయంలో పార్టీల మధ్య వలసలు పెరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ వైసీపీలో చేరనున్నారు. ప్రస్తుతం కరణం చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల… 13-17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారు. మేం వారిని ఆహ్వానించకున్నా వారంతట వారే వస్తున్నారన్న ఆయన టీడీపీకి గడ్డుకాలమే అని చాలా మందికి అర్ధం అవుతోందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదని, ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టింది కాదని ఆయన అన్నారు.
టీడీపీ నేతలు స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగకుండా వైసీపీ అడ్డుకుంటోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారుని సజ్జల విమర్శించారు. ఓటమికి సాకులు వెతుక్కుంటున్న చంద్రబాబు వైసీపీని దోషిగా చూపుతున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరైనా నామినేషన్ల వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటే మేం ఎస్కార్ట్ ఇచ్చి పంపుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పరిమల్ నత్వానీకి టిక్కెట్ ఇచ్చామన్న సజ్జల టిక్కెట్లను అమ్ముకునే సంస్కృతి టీడీపీదేనని అన్నారు. సుజనా, సీఎం రమేష్, గరికిపాటి, కనకమేడల వంటి వాళ్లకు రాజ్యసభ ఇచ్చిన టీడీపీ.. మమ్మల్ని విమర్శించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.