TDP Janasena Alliance: జగన్ కోసమే తాము ఏకమైనట్లు టిడిపి, జనసేన లో తేల్చి చెప్పాయి.పొత్తు ప్రకటన తర్వాత ఇరు పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీలు తొలిసారిగా భేటీ అయ్యాయి. ఇందుకు రాజమండ్రి వేదిక అయింది. టిడిపి, జనసేన కలయిక, పొత్తు ఏ పరిస్థితుల్లో చేసుకునే అంశంపై పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ స్పష్టతనిచ్చారు. ఈ కూటమిలో ఎటువంటి సమస్యలు రావని చెప్పుకొచ్చారు. వైసీపీ సర్కార్ దురాగతాలే రెండు పార్టీల కలయికకు కారణమని స్పష్టం చేశారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చిన పవన్ పొత్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని అప్పట్లో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జనసేన తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సైతం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నాయి. పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు అనే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయనున్నాయి.
జాయింట్ యాక్షన్ కమిటీల తొలి భేటీ కావడంతో పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం ఆరు అంశాలను పొందుపరిచారు. వాటి ద్వారానే రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. పవన్ వారాహి యాత్ర తో పాటు భువనేశ్వరి సంఘీభావ యాత్రలో సైతం రెండు పార్టీల శ్రేణులు హాజరయ్యేలా చూడాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇక్కడి నుంచి 100 రోజులపాటు రెండు పార్టీల ఉమ్మడి కార్యక్రమాలు కొనసాగేలా డిసైడ్ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై రెండు పార్టీల శ్రేణులు పోరాడాలని తీర్మానించుకున్నారు.
రాష్ట్ర ప్రజల కోసమే ఈ పొత్తు అని పవన్ మరోసారి స్పష్టం చేశారు. తమకు వైసిపి పై కానీ, జగన్ పై కానీ ఎటువంటి వ్యక్తిగత కోపం లేదన్నారు. వైసిపి ప్రభుత్వ అరాచక విధానాలపైనే తమ పోరాటమని చెప్పుకొచ్చారు. ప్రజల కోసమే తాను టిడిపి తో పొత్తు పెట్టుకుంటున్నానని.. 2014లోనే సీనియారిటీకి గౌరవించి చంద్రబాబుకు మద్దతు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసలు మా కూటమిలో సమస్య లు వచ్చే అవకాశమే లేదన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలపై గట్టి పోరాటం చేయాలని పవన్ పిలుపునిచ్చారు.రాబోయేది టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. మొత్తానికైతే పొత్తు ప్రకటన తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీల తొలి భేటీ విజయవంతంగా పూర్తి కావడం రెండు పార్టీల శ్రేణుల్లో ఆనందం నింపుతోంది.