TDP -Janasena Alliance: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అధికారంలో ఉండి వైసీపీ అధినేత, సీఎం జగన్ బలంగా ఉన్నారు. ఆయనను ఢీకొట్టే సామర్థ్యం ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబులో కొరవడింది. వయసు అయిపోవడం.. పాత చింతకాయపచ్చడి విధానాలతో ఆయన ఫెయిడ్ అవుట్ అయిపోయారు. అదే సమయంలో చంద్రబాబును భర్తీ చేయగల సామర్థ్యం జనసేనాని పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. జగన్ వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నిస్తూ.. ప్రజల కోసం పాటుపడుతూ రోజురోజుకు ప్రజాదరణ పొందుతున్నాడు.

విశాఖ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పై నిర్బంధాన్ని అందరూ ఖండించారు. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ కూడా పవన్ ను కలిసి సంఘీభావం ప్రకటించింది. పవన్ ను స్వయంగా చంద్రబాబు కలిసి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ, జనసేన కలిస్తే జగన్ కు గండమేనా? అసలు వీరిద్దరి ఓటు బ్యాంకు ఎంత? కలిస్తే జగన్ ను ఓడించగలరా? అని అందరూ ఆరాతీస్తున్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీ – జనసేన , బీజేపీ కలిసి పోటీశాయి. జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా నేరుగా మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలోనే వీరి కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ 2014 ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా 58.28 శాతం ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 2.285 శాతం ఓట్లు సాధించింది. ఇక వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 1.14 శాతం ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 102 సీట్లు సాధించగా.. బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ 67 సీట్లతో ఓడిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది.
ఇక 2019 ఎన్నికల్లో మాత్రం ఇదే చంద్రబాబు, బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి పోటీచేశారు. రెండు చోట్ల పోటీచేసి గెలువలేకపోయారు. ఏపీ వ్యాప్తంగా కేవలం రాజోలులో మాత్రమే గెలిచి జనసేన ఖాతా తెరిచింది.
2019 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీపై వ్యతిరేకత వైసీపీకి వరమైంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒంటరిగా పోటీచేయడంతో టీడీపీకి పడే ఓట్లు చీలిపోయాయి. తద్వారా వైసీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 49.9 శాతం ఓట్లతో ఏకంగా 151 సీట్లు సాధించింది. ఏపీ చరిత్రలోనే అత్యధిక ఎమ్మెల్యే సీట్లతో జగన్ ప్రభంజనం సృష్టించారు. ఇక టీడీపీకి 39.2 శాతం సీట్లతో 23 సీట్లకే పరిమితమై ఘోరంగా ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ 1.17శాతం ఓట్లు, బీజేపీకి 0.84 శాతం ఓట్లు, జనసేనకు 6.78 శాతం ఓట్లు వచ్చాయి.

2019 ఎన్నికల ప్రకారం చూస్తే జనసేన+టీడీపీకి కలిపి ఇద్దరికి వచ్చిన ఓటు శాతం 45.98 శాతం. అయితే ఇది జగన్ సాధించిన 49.9 శాతం కంటే కేవలం 4శాతం మాత్రమే తక్కువ. నిజంగా ఈ ఇద్దరూ కూటమి కడితే ఈ ఓట్లు చీలిపోకుండా జనసేన+టీడీపీ గెలిచేదే. విడిపోయి ఓడిపోయినట్టుగా అర్థమవుతోంది.బీజేపీని కూడా కలుపుకుంటే వీరిదే విజయం అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ మూడు పార్టీలు విడిపోయి పోటీచేసి జగన్ ను వైసీపీని గెలిపించారని చెప్పొచ్చు.
ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. దీంతో 2019లో సాధించిన 49 శాతం ఓట్లు ఈసారి రావడం కష్టమే. వైసీపీ కోల్పోనున్న ఓటు శాతం ఖచ్చితంగా ప్రతిపక్షాలకే దక్కుతుంది. అందునా పోరాడుతున్న జనసేనకే పడుతుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే? 2014లో ఓడిపోయిన వైసీపీ, 2019లో ఓడిపోయిన టీడీపీ రెండూ కూడా 39 శాతం ఓట్లు సంపాదించాయి. అంటే ఈ రెండింటికి ఏదో ఒక పార్టీ జత కడితే విజయం వారిదే.. ముఖ్యంగా టీడీపీ, జనసేన కలిస్తే ఖచ్చితంగా 50 శాతం ఓటు బ్యాంకు సంపాదించగలరు. ఏపీలో విజయం సాధించగలరు. ఎన్నికల్లో ఓట్ల శాతం బట్టి ఇది తేటతెల్లం అవుతుంది. జగన్ ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలవాల్సిన ఆవశ్యకత ఈ ఓట్ల శాతాన్ని బట్టి అర్థమవుతోంది.