TDP: టిడిపి ఎన్డీఏలో చేరనుందా? బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ప్రక్రియ ప్రారంభం కానుందా? పొత్తులు, సీట్ల సర్దుబాటు పై అధికారిక ప్రకటన చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈనెల 19 లేదా 20వ తేదీన ఢిల్లీకి చంద్రబాబుతో పాటు పవన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ ఖాయమని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా పొత్తుల అంశం తేల్చేయాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు.
రెండు రోజులపాటు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11,500 మంది ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల విషయంలో బిజెపి హై కమాండ్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఏయే పార్టీలతో పొత్తు ఉంటుందో వెల్లడించే పరిస్థితి కనిపిస్తోంది.
పది రోజుల క్రిందట ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. పొత్తుల అంశాన్ని ప్రతిపాదించారు. అటు బిజెపి నుంచి కీలక ప్రతిపాదనలు అందుకున్నారు. ఇది జరిగి పది రోజులు అవుతున్నా చంద్రబాబు నోరు తెరవలేదు. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దీంతో బిజెపి విషయం తేల్చేందుకు పవన్ తో పాటు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. 20వ తేదీన ముఖాముఖిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఎక్కడెక్కడ పొత్తులు ఉంటాయో… ఆ నియోజకవర్గ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పుడు సీట్లు త్యాగాలు చేస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి ఆశావహులకు సమాచారం ఇచ్చారని.. కొందరు మెత్తబడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది.
ముందుగా చంద్రబాబు టిడిపి ఎంపీ అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టతకు వచ్చారు. జనసేన, బిజెపికి కేటాయించాల్సిన సీట్ల విషయంలో పెండింగ్లో పెట్టారు. పొత్తులు కొలిక్కి వచ్చిన తర్వాత ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ లాంఛనంగా చేయనున్నారు. బిజెపి అగ్రనేతల సమక్షంలోనే మీడియాకు ఈ విషయం వెల్లడించనున్నారు. మొత్తానికైతే వచ్చే వారంలో ఎన్డీఏలకు తెలుగుదేశం పార్టీ చేరిక ఖాయంగా తేలుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.