TDP : తెలుగుదేశం పార్టీకి బలమున్న జిల్లాలో కృష్ణా ఒకటి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పదిమంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలింది నాలుగు అసెంబ్లీ స్థానాలు. కానీ ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఈ మిగిలిన సీట్లలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కీలకమైన పెనమలూరు, మైలవరం స్థానాలకు సంబంధించి టిడిపి అభ్యర్థులు ఎవరన్న దానిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, విజయవాడ నగర వైసిపి అధ్యక్షుడు భవకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అతి త్వరలో పార్టీలో చేరనున్నట్లు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు.
గత ఎన్నికల్లో మైలవరం నుంచి టిడిపి అభ్యర్థిగా దేవినేని ఉమా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ తాను టిడిపిలో చేరనున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వం తీరుపై వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. మైలవరం టికెట్ ఇస్తామని చెబుతూ చంద్రబాబు, పవన్, లోకేష్ లను తిట్టాలని జగన్ సూచించారని.. తాను అందుకు ఒప్పుకోలేదని వసంత కృష్ణ ప్రసాద్ చెబుతున్నారు. ఇష్టం లేని పార్టీలో ఇమడలేనని.. అందుకే వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరతానని వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. దేవినేని ఉమా తో తనకు ఎటువంటి విభేదాలు లేవని.. అందరం కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తామని చెబుతున్నారు.
మరోవైపు దేవినేని ఉమ చంద్రబాబును కలిసి చర్చించారు. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై నిరుత్సాహం వ్యక్తం చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరనుండడంతోనే మైలవరం టికెట్ ను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు దేవినేని ఉమాను సముదాయించినట్లు సమాచారం.సీట్ల సర్దుబాటులో భాగంగా పెండింగ్లో పెట్టాల్సి వచ్చిందని.. కచ్చితంగా ప్రత్యామ్నాయం చూస్తానని హామీ ఇవ్వడంతో వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరం టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు అయ్యింది. అయితే దేవినేని ఉమాను ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది చూడాలి.
మరోవైపు పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరారు. అయితే ఆయనకు ఇదివరకే నూజివీడు ఇన్చార్జిగా నియమించారు. ప్రస్తుతం పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టిడిపి ఆశావహుడిగా ఉన్నారు. పార్థసారధిని నూజివీడుకు పంపించడంతో బోడే ప్రసాద్ కు లైన్ క్లియర్ అయినట్టు అయింది. కానీ దేవినేని ఉమాకు పెనమలూరు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ నుండి చేరిన భవకుమార్ కు విజయవాడ నగర పరిధిలోను ఏదో ఒక నియోజకవర్గ సర్దుబాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని తెలుస్తోంది. అటు నగరంలోని మిగతా రెండు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులను ఖరారు చేశారు. అటు బుద్ధ వెంకన్న సైతం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు భవ కుమార్ తో పాటు జలీల్ ఖాన్ వంటి నేతలకు అవకాశం ఇస్తారా? లేకుంటే ప్రత్యామ్నాయాలు చూపుతారా? కూటమి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు కేటాయిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే కృష్ణాజిల్లా టిడిపిలో రాజకీయం రంజుగా ఉంది. ఇది ఎటువైపు దారితీస్తుందా అన్నది చూడాలి.