తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడికి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఘోర పరాభవం జరిగింది. ఇన్నాళ్లూ చంద్రబాబు తన కంచు కోటగా చెప్పుకుంటున్న నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూసింది టీడీపీ. బుధవారం నిర్వహించిన మూడో దశ ఎన్నికల్లో అధికార వైసీపీ జయభేరి మోగించింది. నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు గెలుచుకొని బాబు కోటలో జెండా ఎగరేసింది జగన్ పార్టీ.
Also Read: కంచుకోటకు బీటలు.. చంద్రబాబుకు ఏం మిగిలింది?
చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 89 పంచాయతీలకు ఎన్నిక జరిగింది. మిగిలిన 4 పంచాయతీల్లో ఎన్నిక నిర్వహించలేదు. అయితే.. ఎన్నిక జరిగిన 89 పంచాయతీల్లో.. ఏకంగా 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు జెండా ఎగరేయడం విశేషం. కేవలం 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. మరొక స్థానంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు.
టీడీపీ అధినేత చంద్రబాబు 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అప్పటి నుంచి ఇక్కడ చంద్రబాబు హవానే కొనసాగుతోంది. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీ హవానే సాగింది. మొత్తం 93 పంచాయతీలకుగానూ కేవలం 12 చోట్ల మాత్రమే వైసీపీ గెలుపొందింది. కానీ.. ఇప్పుడు ఫలితాలన్నీ తారుమారైపోయాయి. టీడీపీ కోటలో వైసీపీ జెండా రెపరెపలాడుతుండడం విశేషం.
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలైన గుడిపల్లి, కుప్పం, శాంతిపురం, రామకుప్పం.. అన్ని చోట్లా వైసీపీ మద్దతుదార్లు విజయ ఢంకా మోగించారు. ఏకంగా చంద్రబాబు నియోజకవర్గంలోనే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని, వైసీపీ పాలనకు ప్రజామోదం ఏ స్థాయిలో ఉందే ఈ ఫలితాలే నిదర్శనమని నేతలు అంటున్నారు.
Also Read: ఆ ఆరు పదవులూ వైసీపీవే..
అయితే.. ఈ ఫలితాలను ఊహించలేకపోయిన టీడీపీ నేతలు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురవుతున్నారు. కుప్పంలో ఈ స్థాయిలో ఘోర పరాభవం జరగడానికి కారణాలు ఏంటని విశ్లేషించే పనిలో పడ్డారు. రాష్ట్ర పార్టీ ఆఫీసు నుంచే కాకుండా.. ఇతర నేతలు కూడా కుప్పం స్థానిక నేతలకు ఫోన్లు చేస్తున్నారట. కానీ.. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అవస్థలు పడుతున్నారట స్థానిక లీడర్లు. మండలానికి ఒక ఇన్ ఛార్జ్ ను పెట్టినప్పటికీ.. ఈ ఫలితాలు రావడమేంటని విస్మయం వ్యక్తంచేస్తున్నారట.
కాగా.. కుప్పం ఫలితాల నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏంటో తేలిపోయిందని, మరి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తారో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడే ఉంటారా..? వేరే నియోజకవర్గానికి వెళ్లిపోతారా? అన్నది ప‌్రజలకు చెప్పాలన్నారు. శకునిని నమ్మిన దుర్యోధనుడిలా చంద్రబాబు నాశనం అవుతున్నారని, ఇక్కడ శకుని పాత్రను రెండు పత్రికలు పోషిస్తున్నాయని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. మొత్తానికి కుప్పం ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరి, రాబోయే మునిసిపల్ ఎన్నికలకు చంద్రబాబు ఎలా సిద్ధమవుతారో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్