
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధ్యమైనంత త్వరగా అమ్మేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. కార్మికులు, రాజకీయ పార్టీలు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, ఆందోళనలు కొనసాగిస్తున్నా.. బీజేపీ సర్కారు మాత్రం వెనక్కు తగ్గట్లేదు. కుదిరితే అమ్మేయడం.. కుదరకపోతే మూసేయడం తథ్యం అని చెబుతోంది కేంద్ర సర్కారు. ఈ క్రమంలోనే ఆ మధ్య బిడ్డింగ్ కూడా ఆహ్వానించింది. అయితే.. ఎవరు రేసులో ఉన్నారు? అసలు కొనుగోలుకు ఎవరైనా ఆసక్తిగా ఉన్నారా? వంటి వివరాలేవీ తెలియలేదు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ సంస్థ పేరు తెరపైకి వచ్చింది.
త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో ఆంధ్రులకు దశాబ్దాల అనుబంధం ఉంది. అంతేకాకుండా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. అలాంటి ఫ్యాక్టరీని నష్టాల పేరుతో అమ్మేయడం అన్యాయమని కార్మికులు ఆందోళన సాగిస్తున్నారు. అంతేకాదు.. సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. అయినప్పటికీ.. కేంద్రం మాత్రం మనసు మార్చుకునేట్టు కనిపించట్లేదు.
ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఈ సంస్థను రాష్ట్ర సర్కారుకు అప్పగించాలని ఆ లేఖలో కోరింది. కానీ.. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. అయితే.. ఉన్నట్టుండి ఓ వార్త బయటకు వచ్చింది. దేశీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్స్.. విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ సీఈవో, ఎండీ నరేంద్రన్ మీడియాకు వెల్లడించారు.
దీంతో.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగనుందనే విషయం తేలిపోయింది. మరి, పోటీలో ఇంకా ఏయే సంస్థలు పాల్గొంటాయనేది చూడాలి. అయితే.. స్టీల్ ఫ్యాక్టరీ కొనుగోలు ఒకెత్తయితే.. దానికి అనుబంధంగా వేలాది ఎకరాల భూములు ఉండడం మరో ఎత్తు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సమయంలో చాలా మంది ప్రజలు తమ భూములను ఇచ్చారు. అందులో దాదాపు పది వేల ఎకరాల వరకు ఖాళీగానే ఉన్నాయి. మరి, ప్రైవేటు కంపెనీలకు ఫ్యాక్టరీని మాత్రమే ఇస్తారా? ఈ భూములు కూడా ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.