Target TRS: తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ పెరుగుతోంది. మొన్నటి వరకు ముందస్తు అవకాశం లేదని అంతా భావించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ఈసారి ముందుకు వెళ్లే అలోచన లేదని, గతంలో తాను ప్రారంభించిన పథకాలు పూర్తి చేయడానికి ముందస్తుకు వెళ్లామని చెప్పారు. కానీ విపక్షాలు కేసీఆర్‌ను నమ్మడం లేదు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ ‘నేను ముందస్తుకు రెడీ.. దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయండి’ అంటూ విపక్షాలకు సవాల్ విసిరారు. దీంతో తెలంగాణలో మళ్లీ రాజకీయాలు హీటెక్కాయి. వేడి మొదలైంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టలు వ్యూహ రచన చేస్తున్నాయి. పార్టీలో కీలక నేతలైన సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కేసీఆర్ కూతురు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు టార్గెట్‌గా కాంగ్రెస్, కమలం నేతలు పావులు కదుపుతున్నారు.
సీఎంను టార్గెట్ చేసిన ఈటల..
టీఆర్‌ఎస్‌లో మంత్రి పనిచేసి భూముల గొడవతో బహిష్కరణకు గురై బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు కేసీఆర్, ఆయన మంత్రివర్గం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక్కడే కేసీఆర్ అహాన్ని దెబ్బకొట్టిన ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లోనే కేసీఆర్‌ను కొట్టాలని నిర్ణయించారు. ఈమేరకు వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని, ఈమేరకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టానని ప్రకటించారు. తద్వారా కేసీఆర్ తప్పనిసరిగా గజ్వేల్‌లోనే పోటీ చేయాల్సిన పరిస్థితి కల్పించారు. వాస్తవంగా ఈసారి కేసీఆర్ నియోజకవర్గం మారాలని భావించారు. సూర్యపేట నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. దీనిని పసిగట్టిన కమలనాథులు ఈటల ద్వారా కేసీఆర్‌ను గజ్వేల్ దాటకుండా ఈటల అస్త్రం సంధించారు. ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గం మారితే ఈటలకు భయపడి మారారన్న ప్రచారం జరుగుతుంది. ఇది కమలనాథులకు కలిసి వస్తుంది.
Also Read: Heavy Rains in Telangana: వీడని ముసురు.. తెలంగాణ అల్లకల్లోలం
కేటీఆర్‌ను ఓడించేందుకు బండి, రేవంత్ వ్యూహం..
తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తుతం ప్రభుత్వంతో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిలా మారారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేటీఆర్‌ను సిరిసిల్లలో ఓడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని బండి సంజయ్ నిర్ణయించినట్లు తెలిసింది. కేటీఆర్‌పై పోటీ చేయడం ద్వారా ఆయనను నియోజకవర్గానికే పరిమితం చేయవచ్చని కమలనాథుల వ్యూహంలా కనిపిస్తోంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా కేటీఆర్ ఓటమే లక్ష్యంగా సిరిసిల్లలో రాహుల్‌గాంధీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు రాహుల్‌ను ఒప్పించగలిగారు. గతంలో రైతులకు డిక్లరేషన్ ప్రకటించినట్లుగా ఈసారి సిరిసిల్లలో నిర్వహించే సభ ద్వారా నిరుద్యోగుల డిక్లరేషన్ రాహుల్‌గాంధీతో ప్రకటింప చేసే ఆలోచనలో ఉన్నారు రేవంత్. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ప్రకటించడం కన్నా ముందుగానే వర్గాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి.. వాటిని ప్రజల్లో చర్చకు పెడితే ఫలితం ఉంటుందని నమ్ముతున్నారు. రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రచ్చబండను నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ డిక్లరేషన్‌ను ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
హరీశ్‌పై పోటీకి రఘునందన్‌రావు..
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్ సర్కార్‌లో కలక నేత. సీఎం కేసీఆర్ మేనల్లుడిగా, నియోజకవర్గాని అభివృద్ధి చేసుకోవడంలో ఆదర్శంగా ఉండడంతోపాటు ట్రబుల్ షూటర్‌గా హరీశ్‌కు గుర్తింపు ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో హరీశ్‌ను సిద్దిపేట దాటకుండా చేయడమే లక్ష్యంగా ఆయనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ను పోటీకి నిలపాలని బీజేపీ భావిస్తోంది. అంతకమటే ముందే రఘునందన్ కూడా తాను హరీశ్‌రావుపై పోటీకి సై అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్న హరీశ్ వచ్చే ఎన్నికలల్లో తాను ఓడిపోకుండా ప్రయత్నాలు చేసుకునే పరిస్థితి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది.
కవితను టార్గెట్ చేసిన అర్వింద్..
నిజామాబాద్ ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మళ్లీ టార్గెట్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కవితను ఓడించడం ద్వారా అర్వింద్ సంచలనం సృస్టించారు. ఈ సారి కవిత అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రభావితం చేసేలా ధర్మపురి అర్వింద్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కవితకు దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. తద్వారా ఆమె అసెంబ్లీకి పోటీ చేయకుండా చూడాలన్నదే కమలనాథుల టార్గెట్‌గా కనిపిస్తోంది.
మొత్తంగా బీజేపీ చతుర్విదాస్త్రం సంధిస్తుండగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాత్రం, కేసీఆర్, కేటీఆర్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read: KCR Vs Eatela: కేసీఆర్ పై ఈటల పోటీ.. అసలు కారణం ఇదేనా..?