Homeజాతీయ వార్తలుAnnamalai political future: తమిళనాట సంచలనం: అన్నామలైకి దారేది?

Annamalai political future: తమిళనాట సంచలనం: అన్నామలైకి దారేది?

Annamalai political future: భారతీయ జనతా పార్టీకి ఇలా జరగాల్సిందే. తమిళనాడులో అధికారంలోకి రావాలని కలలుగన్న కమలం పార్టీ పెద్దలు.. వాటిని ఇక కలలుగానే కొనసాగించాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి అన్నామలై రూపంలో ఒక సిసలైన నాయకుడు.. తన ఐపీఎస్ సర్వీసును పక్కన పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తే.. కమలం పార్టీకి తిరుగులేని స్థాయిని తమిళనాడులో కల్పించాలని సంకల్పిస్తే.. కేవలం అన్నాడీఎంకే అనే పార్టీతో పొత్తు కోసం అన్నామలై అనే శక్తివంతమైన నాయకుడిని బిజెపి పక్కన పెట్టింది. రాష్ట్ర అధ్యక్షుడి స్థానం నుంచి తొలగించింది.. అంతేకాదు ఎన్నికల్లో అతని పాత్రను నామమాత్రం చేసింది. గెలిచే స్థానాలను అన్నా డీఎంకేకు ఇచ్చేసింది.

ఇవన్నీ చూస్తున్న అన్నామలై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కార్యనిర్వాహక అధ్యక్షుడు బిఎల్ సంతోష్ తో సమావేశమైనట్టు సమాచారం. సుదీర్ఘ సమయం భేటీ తర్వాత ఆయన తన రాజీనామా పత్రాన్ని వారికి అందజేసినట్టు తెలుస్తోంది. ఇక మంగళవారం సాయంత్రం అన్నామలై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మాత్రం అన్నామలైని పార్టీలో కొనసాగాలని కోరినట్టు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కూడా ఇచ్చే అవకాశాన్ని తాము పరిశీలిస్తున్నామని కేంద్ర అనేకత్వం చెప్పినట్టు సమాచారం. కాగా పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చేవరకు ఢిల్లీని విడిచిపెట్టి వెళ్లకూడదని అన్నామలై కి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ చెప్పినట్టు తెలుస్తోంది. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని పెట్టేందుకు అన్నామలై సిద్ధంగా ఉన్నట్టు అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా తన మద్దతుదారులతో అన్నామలై వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ పై చర్చలు సాగిస్తున్నారు. వీటికి సంబంధించి కొద్ది రోజుల్లోనే అసలు విషయాలను వెల్లడిస్తామని.. తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నామలై వెల్లడించారు.

అన్నామలై నితిన్ చెప్పినట్టుగా ఢిల్లీలో ఉంటారా.. వెంటనే తమిళనాడు వచ్చేస్తారా.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ద్రావిడ సిద్ధాంతాలు లేని తమిళనాడు రాజకీయాలను చూడాలని అన్నామలై కోరుకుంటున్నారు. ద్రావిడ సిద్ధాంతాలతో ఆ రెండు పార్టీలు తమిళనాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని అనేక సందర్భాలలో అన్నామలై ఆరోపించారు. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన ఏ మాత్రం సహించలేకపోయారు. బిజెపి అధినాయకత్వానికి చెప్పినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ఆయన తన దారి తాను చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ స్థానం ఇచ్చినప్పటికీ కూడా అన్నామలై మెత్తబడకపోవచ్చు అని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version