
విద్వేషంతో రగిలిపోయేవాళ్లు.. శాంతి మంత్రం పఠిస్తున్నారు! నడిరోడ్డుపై తలలు నరికేవాళ్లు.. ప్రజల రక్షణ గురించి మాట్లాడుతున్నారు! మహిళను బురఖా చాటున దాచేసేవాళ్లు.. వారి హక్కుల గురించి ప్రస్తావిస్తున్నారు.. పరిరక్షిస్తామని హామీలి కూడా ఇచ్చేస్తున్నారు! ఏం జరుగుతోంది? ఎందుకిలా మారిపోయారు? మారిపోయారా.. నటిస్తున్నారా? దేనికోసం ఇదంతా చేస్తున్నారు? ఈ కొత్త వ్యూహం వెనుక అర్థమేంటీ? తాలిబన్ల తాజా ప్రకటనలతో ప్రపంచం మొత్తం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడింది.
ప్రజాస్వామ్యాన్ని పాతరేసి.. రాక్షసత్వంతో రాజ్యమేలాలని చూసే తాలిబన్లు.. సరికొత్త ప్రకటనలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టేశామని, ఇక ఎవరి ప్రాణానికీ హాని తలపెట్టబోమంటున్నారు. రెండు దశాబ్దాలుగా తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి, పోరాడిన వారి ప్రాణాలకు సైతం ముప్పు తలపెట్టబోమంటూ హామీ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు.. తమ సిద్ధాంతలకు పూర్తి భిన్నంగా మహిళలను సైతం ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తామంటూ ఊహించని పల్లవి అందుకున్నారు!
ఆఫ్ఘనిస్తాన్ ను శరవేగంగా ఆక్రమించేసిన తాలిబన్లు.. అధికారికంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడంతో.. మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తదితర నేతలతో దశలవారీగా మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వంలో ఇతర నేతలకు సైతం అవకాశం ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఈ విషయం మీదనే రోజుల తరబడి చర్చలు సాగుతున్నాయి.
అయితే.. మరోవైపు ప్రజలు ఎంతగా భీతిల్లిపోతున్నారో అక్కడి పరిస్థితులు కళ్లకు కడుతున్నారు. అవకాశం ఉన్న అన్ని దారుల్లోనూ దేశం వదిలి పారిపోయేందుకు ఆఫ్ఘన్లు ప్రయత్నిస్తున్నారు. విమానాల్లో కిక్కిరిసిపోతున్న జనం.. వాటి రెక్కలపై ప్రయాణించి కిందపడి ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో భారత్, బ్రిటన్ వంటి దేశాలు శరణార్థులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. భారత్ ఎలక్ట్రానిక్ వీసాను అమల్లోకి తేగా.. అసలు వీసా లేకుండానే తమ దేశంలోకి రావొచ్చంటూ బ్రిటన్ తలుపులు తెరించింది.
ఈ పరిస్థితుల్లో.. చాలామంది ఆఫ్గన్లు దేశం వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో తాలిబన్లు కొత్త పాట అందుకోవడం ప్రపంచాన్ని విస్మయ పరిచింది. తాము ఎవ్వరి ప్రాణాలకూ హాని తలపెట్టబోమని, మహిళలకు రక్షణ కల్పిస్తామని ఎవ్వరూ ఊహించని మాటలు మాట్లాడుతున్నారు. గడిచిన 40 ఏళ్లలో మహిళలు ఎంతో నష్టపోయారని, వారి హక్కులకు పాటు పడతామంటూ వాగ్ధానాలు చేస్తున్నారు.
అయితే.. వారు చేస్తున్న ప్రకటనలు వ్యూహాత్మకంగా ఉన్నాయని, అందులో వాస్తవం పాళ్లు తక్కువేననే అభిప్రాయం వ్యకమవుతోంది. బీబీసీ మహిళా జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. ‘‘మహిళలకు హక్కులు అంటే.. రాజకీయాల్లో చేరి ప్రజాస్వామ్య బద్ధంగా వారు ఎన్నిక కావడానికి మీరు అంగీకరిస్తారా?’’ అన్న ప్రశ్నకు తాలిబన్ నేతలు ఎగతాళిగా నవ్వడం సందేహాలకు తావిస్తోంది.
వ్యూహాత్మకంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాలిబన్ల దురాక్రమణతో ప్రపంచ దేశాలు ఆఫ్గన్ కు చేస్తున్న సాయం నిలిపేసే అవకాశం ఉంది. ఇప్పటికే.. జర్మనీ ఈ ప్రకటన చేసింది. దాదాపు 2,500 కోట్ల విలువైన సాయాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. మిగిలిన దేశాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల.. ఆ నిధుల కోసమే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాలు కూడా వారి హామీలను నమ్మట్లేదు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని దేశం విడిచి పారిపోయేందుకే చూస్తున్నారు. మరి, తాలిబన్లు ఎలాంటి చరిత్రను ఆఫ్ఘన్ నుదుట లిఖించాలని చూస్తున్నారో తెలియడానికి ఎక్కువ కాలమేమీ పట్టకపోవచ్చు.