Rajaji Swatantra Party: నరేంద్ర మోదీ.. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేత. క్లిష్టమైన సమస్యలను తన వ్యూహంతో పరిష్కరించే వ్యూహం ఆయనదని చెప్పుకుంటారు. మరి అలాంటి నేతను ప్రాంతీయ పార్టీకి చెందిన కేసీఆర్ ఎదుర్కోగలడా..? దక్షిణాది నుంచి ఢిల్లీని ఢీకొట్టగలరా..? అయితే గతంలో ఓ నేత అప్పటి ప్రధానమంత్రి నెహ్రూపై ఇలాగే పోరాటం చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన పోరాటం దాదాపు సక్సెస్ అయింది. ఆయన ఏ విధంగా ముందుకు వెళ్లారు..ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న దానిపై స్పెషల్ ఫోకస్.
దేశంలో ఎన్డీఏ ఆగడాలు పెరిగిపోయాయని, వాటిని అంతమొందించడానికి జాతీయ రాజకీయాలు అవసరమని కేసీఆర్ ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం బిజీబిజీగా మారారు. ముందుగా కొత్త పార్టీని పెట్టాలనుకున్నా.. ఆ తరువాత నిపుణుల సూచన మేరకు ఇప్పుడున్న పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు రెడీ అవుతున్నారు. ఈనెల చివరి వరకు జాతీయ పార్టీని ఢిల్లీలో ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి చరిత్ర పరిశీలిస్తే.. కేంద్రంలోని పెద్దలను ఎదురించిన చరిత్ర మన దక్షిణాది నేతలకు ఉంది. రాజాజీ అనే లీడర్ ‘స్వతంత్ర పార్టీ’ని స్థాపించారు. కేసీఆర్ లాగే అప్పటి ప్రధాని నెహ్రూను ఢీకొట్టేందుకు రాజాజీ పోరాటం చేశారు.
Also Read: BJP Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనలో బీజేపీ భారీ స్కెచ్.. చివరివరకూ సస్పెన్సే
సోషలిజాన్ని, పెత్తందారి విధానాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని, దీనిని నిర్మూలించేందుకు 1959లో ‘స్వతంత్ర పార్టీ’ని స్థాపించారు. రాజాజీగా పేరు పొందిన చక్రవర్తి రాజగోపాలచారి ఈ పార్టీ వ్యవస్థాపకుడు. ఈయన పార్టీ పెట్టగానే న్యాయవాదులు, ఆర్థిక వేత్తలు, రైతు నాయకులు, జర్నలిస్టులు ఆయనకు మద్దతుగా నిలిచారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం ఈ పార్టీ వెంట నడిచాయి. రాజాజీ పిలుపు మేరకు ఇతర రాష్ట్రాల్లోని నాయకులంతా తరలివచ్చారు. ‘అధికారం కోసం మనం వెంట పడరాదు.. మనవెంటే అధికారం రావాలి’ అని నినదించారు. అనుకున్నట్లే రాజాజీ పార్టీని స్థాపించినా ఆయన అధ్యక్ష పదవిని వేరొకరికి అప్పజెప్పారు. ఆయనెవరో కాదు తెలుగు ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఎన్ జి రంగా. ఈయన పదేళ్ల పాటు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. రాజాజీ కేవలం కౌన్సిల్ సభ్యుడిగానే కొనసాగారు.
అయితే రాజాజీ అంతకుముందే రెండుసార్లు మద్రాసుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ గా పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఇక స్వతంత్ర పార్టీలో ఎన్ జి రంగాతో పాటు ఖాసా సుబ్బారావు కూడా ఉన్నారు. ఈయన స్వతంత్ర, స్వరాజ్య అనే రెండు పత్రికలను నడిపేవారు. భారతీయ జర్నలిజానికి బాటవేసిన మేధావి అని చెప్పుకుంటారు. వీరిద్దరు స్వతంత్ర పార్టీలో కీలకంగా ఉండేవారు.
1962లో లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ 192 స్థానాల్లో పోటీ చేయగా 22 సీట్లను గెలుచుకుంది. జాతీయ స్థాయిలో 8.5 శాతం ఓట్లు పడ్డాయి. వివిధ రాష్ట్రాల్లో 207 మంది శాసన సభ్యులను గెలుచుకున్నారు. ఈ సంఖ్య అప్పటి సీపీఐ, ప్రజా సోషలిస్టు పార్టీ, జనసంఘ్ కంటే ఎక్కువే. 1967లో స్వతంత్ర పార్టీ మరింత విస్తరించుకుంది. ఆ సమయంలో 44 స్థానాల్లో అభ్యర్థులు గెలిచారు. అయితే ప్రతిపక్ష హోదాకు కేవలం 7 సీట్లే తక్కువ. అయినా ఈ పార్టీకి ఆ హోదా ఇవ్వలేదు. ఆ సమయంలో రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల సంఖ్య 256కు పెంచింది.
ఇదిలా ఉండగా 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ విజయం సాధించారు. ఆ సమయంలో స్వతంత్ర పార్టీ 8 సీట్లకు పడిపోయింది. ఇది పార్టీ పతనానికి దాని తీసింది. 1972 డిసెంబర్లో రాజాజీ చనిపోయారు. ఆ తరువాత పార్టీ మరింత బలహీనపడింది. చివరకు 1974లో పార్టీని రద్దు చేసి భారతీయ లోక్ దళ్ లో విలీనం చేశారు. దక్షిణాదికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ దేశ మొదటి ప్రధాని నెహ్రును ఎదిరించిన చరిత్ర ‘స్వతంత్ర పార్టీ’ దక్కించుకుంది. ఆ సమయంలో పార్టీ వ్యవస్థాపకుడు రాజాజీ అనుసరించిన కొన్ని విధానాలను ఇతర నేతలను ఆకట్టుకున్నాయి. సమష్టి విధానంతో ముందుకు వెళ్లాలనుకోవడం ఇతరులను ఆకర్షించింది. అంతేకాకుండా ఆయన పార్టీ స్థాపించినా ఏనాడు అధ్యక్ష పదవి కోరలేదు.
అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా ప్రధాని మోదీని ఢీకొట్టేందుకు ముందుకు వెళ్తున్నారు. దీంతో పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘దేశ్ కి నేత కేసీఆర్’ అంటూ నినాదాలిస్తున్నారు. అయితే ఈ హంగామా అంతా అభిమానుల్లో మాత్రమే కనిపిస్తుందని కొందరు మేధావులు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు, బలమైన జాతీయ పార్టీ అనే వాదాల మధ్య పొత్తు కుదరడం కొంచెం కష్టమే.. అంతేకాకుండా కేసీఆర్ ప్రతీ ఎన్నికల ముందు ఇలా ప్రచార కర్తగా మారాలనుకుంటారు. గత ఎన్నికల ముందు యునైటెడ్ ఫ్రంట్ అంటూ తిరిగారు. ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ లీకులిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే తప్ప దేశానికి చేసేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
Also Read:Bendapudi Students: వారంతా ఫెయిలయ్యారా? బెండపూడి విద్యార్థులపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?