MLC Sheikh Sabji: ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దారుణంగా చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఘటన కొత్త మలుపు తిరుగుతోంది. అసలు సాబ్జిని ఎవరు హత్య చేశారు? అసలు ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? దీని వెనుక ఎవరైనా సూత్రధారులు ఉన్నారా? అన్న చర్చ నడుస్తోంది. మొన్ననే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాబ్జి గెలుపొందారు. ప్రజా సంఘాలతో కలిసి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాబ్జి మృతి చెందడం బాధాకరం.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1966 లో సాబ్జి జన్మించారు. ఆయన ముత్తాతల నుంచి ఆయన వరకు అందరూ టీచర్లే. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా సాబ్జీ పని చేసేవారు. ఐదేళ్ల పాటు సర్వీస్ ఉండగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందారు. 2019 ఫిబ్రవరిలో సిపిఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఏలూరు నుంచి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించారు. దీంతో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొద్దిరోజుల కిందట పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు సాబ్జి మద్దతు తెలిపేందుకు ఏలూరు నుంచి తన వాహనంలో బయలుదేరారు. భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, గన్ మాన్, ఆయన పీఏ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై సాబ్జి కుమారుడు అనుమానం వ్యక్తం చేశాడు. మా నాన్నను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మా నాన్న కూర్చున్న వైపే ఢీకొట్టారు. ఆయన మృతి పై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. మా తమ్ముడు పై కక్షగట్టి చంపారని సోదరుడు సైతం ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.