Pawan Kalyan Varahi
Pawan Kalyan Varahi: పవన్ వారాహి యాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందా? నిబంధనల పేరిట కట్టడి చేయాలన్న ప్రయత్నంలో ఉందా? యాత్రలో మినిట్ టు మినిట్ ప్రొగ్రాం ఇవ్వాలని కోరడం అందులో భాగమేనా? అంటే జనసేన వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆది నుంచి వారాహి వాహనంపై వైసీపీ శ్రేణులు అక్కసును వెళ్లగక్కుతున్నారు. వాహనం ఎలా రోడ్డుపైకి వస్తుందో చూస్తామని సవాల్ చేశారు. ఏపీ రహదారులపై అడ్డుకుంటామని కూడా ప్రకటించారు. దీని పవన్ సైతం అదే స్థాయిలో రిప్లయ్ ఇచ్చారు. ఎలా అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు. దీంతో వైసీపీ బ్యాచ్ తోక ముడిచిన సందర్భాలున్నాయి.
రేపటి నుంచి పవన్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజల అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వహణ కోసం బాధ్యులను సైతం నియమించారు. అయితే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న జనసేన నాయకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ముందస్తుగానే జన సేన నాయకులు పోలీసులకు లేఖలు ఇచ్చారు. కానీ నిబంధనల ప్రకారం ఇవ్వాలని పోలీసులు మడత పేచీ పెడుతున్నారు. దీంతో అనుమతులు కోసం కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడుతున్నారు.
గతంలో కూడా పవన్ పర్యటలను జగన్ సర్కారు అడుగడుగునా అడ్డు తగిలిన సందర్భాలున్నాయి. అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేశారు. విశాఖలో అయితే భద్రతా కారణాలు చెప్పి హోటల్ రూమ్ కే పరిమితం చేశారు. ఇప్పటం బాధితుల పరామర్శ సమయంలో సైతం అడుగడుగునా అడ్డు తగిలారు. ఒక్క విషయం గుర్తించుకోవాలని పవన్ కల్యాణ్ ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు మాత్రమే కాదు. ప్రజల్లో చాలా క్రేజ్ ఉన్న సినిమా నటుడు కూడా. అటువంటి వ్యక్తి భద్రత విషయంలో జగన్ సర్కారు అతి చేస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
వారాహి యాత్ర విషయంలో వైసీపీ అల్లరిమూకల హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం కూడా అతిగా ఉంది. ఇప్పుడు పోలీసుల ద్వారా జగన్ సర్కారు నియంత్రించేందుకు ప్రయత్నిస్తుండడంతో జనసేన నాయకత్వం కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో నాటి ప్రభుత్వం భద్రత కల్పించడంతో పాటు ఇబ్బందులు లేకుండా చూడడం వల్లే పాదయాత్ర సాఫీగా పూర్తయ్యింది. వైసీపీ సర్కారు మాదిరిగా వ్యవహరించి ఉంటే పాదయాత్ర చేసి ఉండేవారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టినా వారాహి యాత్ర సక్సెస్ ఫుల్ గా రన్నవుతుందని జన సైనికులు బళ్లగుద్ది మరీ చెబుతున్నారు.