Karnataka Elections: దేశంలో ఏడాది తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లోక్ సభకు ఎన్నికలు జరుగుతాయి. ఏడాది జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం చేయడానికి జరిగే లోక్ సభ ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. ఈ తరుణంలో తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. ఏడాది మొదట అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటకలో జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశంపై పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సంస్థలు సర్వే చేశాయి. తొలి ఫలితాలను ఇటీవల ఆ సంస్థలు వెల్లడించాయి. ఇందులో వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ రాబోతున్నట్లు తేల్చాయి. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవిస్తుందని, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో జేడీఎస్ ఉంటాయని తేల్చింది. ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాని నేపథ్యంలో.. జెడిఎస్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అంచనా వేశాయి.

అవినీతి ప్రభావం..
కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వెనుక పడడానికి ప్రధాన కారణం స్వయంకృతాపరాధమే అనిపిస్తుంది. కర్ణాటకలో పెరుగుతున్న అవినీతి వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజాప్రతినిధులకు మాట ఇవ్వాల్సిందే అన్న పరిస్థితి అక్కడ నెలకొంది. వాటా ఇవ్వలేక ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా వెలుగు చూసింది. చాలామంది కాంట్రాక్టర్లు కూడా బీజేపీ పాలనలో అవినీతి పెరిగింది అన్న భావనలో ఉన్నారు. మరోవైపు ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.
రూరల్ లో కాంగ్రెస్.. అర్బన్ లో బీజేపీ
సర్వే ఫలితాలను విశ్లేషిస్తే.. అధికార బీజేపీ కంటే కాంగ్రెస్ కు 2 శాతం ఓట్లు అధికంగా వస్తాయని అంచనా వేశాయి. ఈ రెండు శాతం ఓట్ల ద్వారా.. కాంగ్రెస్ కు 20కి పైగా సీట్లు అదనంగా వస్తాయని, బిజెపి 10 స్థానాలు కోల్పోతుందని సర్వే సంస్థలు తెలిపాయి. జెడిఎస్ కు 10 నుంచి 15 సీట్లు రావచ్చని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండే ఈ రెండు శాతం ఓట్ల వ్యత్యాసం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుందని అంచనా. అర్బన్ మోటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపినట్లు సర్వేలో తేలింది. గ్రామీణ ఓటర్లు మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని భావిస్తున్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 శాతం ఓట్లు పెరుగుతాయని, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఒక శాతం ఓట్లు పెరుగుతాయని సర్వేలో తేలింది. జేడీఎస్ విషయానికి వస్తే తక్కువ శాతం మంది మాత్రమే ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.

కీలకంగా మారనున్న జేడీఎస్..
కర్ణాటకలో వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో జేడీఎస్ కీలక పాత్ర పోషించనుంది. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే జెడిఎస్ కు ఓట్ల శాతం సీట్లు తగ్గినా పూర్తిస్థాయి మెజారిటీ బీజేపీకి గానీ, కాంగ్రెస్ కు కానీ వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో జెడిఎస్ చక్రం తిప్పే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సర్వే సంస్థలు తేల్చాయి. జెడిఎస్ ఎవరితో కలిస్తే వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
సీఎంగా సిద్ధరామయ్య..
తాజా సర్వేలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని నిర్వహించిన ఓటింగ్ లో.. 28 శాతం మంది సిద్ధరామయ్యకు మద్దతు తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కి 19 శాతం మంది.. యడ్యూరప్పకు 11 శాతం.. కుమారస్వామికి 18 శాతం మంది మద్దతు తెలిపారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి, ఆయన ప్రవేశపెట్టిన అహిందా అనే కార్యక్రమం.. తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడానికి కారణంగా తెలుస్తోంది.