రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆరు నెలల్లో మీ అందరి చేత మంచి సీఎం అనిపించుకుంటా అని రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేశారు. ఏడాది పూర్తయిన సందర్భంగా తన ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం తీసుకున్న ప్రతి అంశంపై రాజకీయంగా విమర్శలు ఎక్కుపెట్టి లబ్దిపొందేందుకు ప్రయత్నం చేసున్నాయి. ఈ విమర్శలను అధికార పక్షం పూర్తి స్థాయిలో తిప్పికొట్టలేకపోతుంది. ఈ సర్వేతో ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు.
ఇందుకు థర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ బాధ్యతను ప్రముఖ మీడియా సంస్థ ఎన్.డి.టీవీకి అప్పగించారు. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించేందుకు ఆంగ్ల చానల్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై త్వరలో సంస్థకు ప్రభుత్వం మార్గ నిర్దేశనం చేయనుంది. రాష్ట్రంలో ఏడాది కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాభిప్రాయాన్ని నిస్పాక్షికంగా సేకరించాలని సర్వే భాద్యతలు అప్పగించిన మీడియా సంస్థకు సూచించారు.
ఏడాది కాలంలో సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం జగన్ దూకుడుగానే ముందుకు వెళ్లారు. కరోనా గడ్డు కాలంలో సంక్షేమ కొత్త పథకాలను ప్రకటించి అమలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇదే రాజకీయ విశ్లేషకులకు విమర్శనాస్త్రంగా మారింది. అభివృద్ధి పథకాలను పక్కన పెట్టడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం తగ్గి ఆదాయం లేక అప్పుల పాలవుతుంది అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే
సర్వే సంస్థతో ప్రభుత్వ కీలక నిర్ణయాలైన మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు, మద్య నిషేధం అమలు, పోలవరం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వంటి అంశాలు, అమ్మఒడి, రైతు భరోసా, వాహన మిత్ర, పీజు రీయింబర్స్మెంట్ ఇతర సంక్షేమ పథకాలపై సర్వే నిర్వహించనున్నారు.
సర్వేలో వచ్చిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం తన పరిపాలన తీరులో మార్పులు తీసుకురావాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలనపై మరింతగా పట్టు సాధించాలని ఈ నిర్ణయం వెనుక వ్యూహంగా సమాచారం.