PM Narendra Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన దిగ్విజయంగా సాగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. 35 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులోనే తన ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు అల్లూరిగా అభివర్ణించారు. ఆయన నడయాడిన నేలపై అడుగు పెట్టడం అద్రుష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమిగా చెప్పుకొచ్చారు. దీనిపై సభలో ప్రజల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. అటు వేదికపై ఏపీ సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, మెగా స్టార్ చిరంజీవి, మంత్రి రోజాతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కరించిన ప్రధాని మోదీ చిరంజీవి వద్దకు వచ్చి కుశలప్రశ్నలు వేశారు. భుజం తట్టి చనువును ప్రదర్శించారు. అయితే మంత్రి రోజా మాత్రం సెల్పీలంటూ హడావుడి చేశారు. ముందుగా ప్రధాని మోదీతో సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించారు. సీఎం జగన్ ను కూడా రావాలని రిక్వెస్ట్ చేశారు. తరువాత మరోసారి ప్రధానితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా రోజాను జగన్ వద్దని సంకేతాలు పంపారు. దీంతో రోజా సైలెంట్ అయిపోయారు. అటు తరువాత స్వాతంత్రోద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులను సన్మానించే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ తొమ్మిది పదుల వయసులో ఉన్న ఓ పండుటాకును చూసి మురిసిపోయారు. ఆమెకు పాదాభివందనం చేశారు. దీంతో సభ ఒక్కసారిగా మౌనంలోకి వెళ్లింది. ఇంతకీ ఎవరు ఆమె అంటూ సభలో ఉన్నవారంతా ఓకింత ఆశ్యర్యానికి గురయ్యారు. స్వాతంత్ర ఉద్యమకారుడు, యోధుడు పసల క్రిష్ణమూర్తి కుమార్తె పసల క్రిష్ణభారతి అని తెలియడంతో హర్షధ్వానాలు ప్రకటించారు.
గాంధేయవాది..
అయితే పసలు క్రిష్ణమూర్తి ఎవరు? స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్ర ఏమిటన్నది చాలా మందికి తెలియదు. అందుకే నేటితరం చాలా మంది ఆరా తీయడం ప్రారంభించారు. పసల క్రిష్ణమూర్తి అసలు సిసలు గాంధేయవాది. చివరి అంకం వరకూ గాంధీ వేషధారణలో తిరుగాడే వారు. దేశభక్తి ఉన్న గొప్ప యోధుడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పడమర విప్పర్రు ఆయన స్వగ్రామం. సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయనకు 16వ ఏటనే అంజలక్ష్మితో వివాహం జరిగింది. స్వాంత్రోద్యమం అన్నా.. గాంధీజీ అన్నా క్రిష్ణమూర్తి దంపతులకు వల్లమానిన అభిమానం. అందుకే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. 1929లో చాగల్లు ప్రాంతాన్ని సందర్శించిన గాంధీజీని పసల క్రిష్ణమూర్తి దంపతులు తమ ఇద్దరి పిల్లలను తీసుకెళ్లి కలిశారు. స్వాతంత్రోద్యమ నిధికి తమ ఒంటిపై ఆభరణాలు వితరణగా అందించారు. ఇద్దరు పిల్లల ఒంటిపై ఉన్న నగలను సైతం అందజేశారు. దీంతో సంతోషించిన గాంధీజీ ఇప్పుడు సరే.. మరెప్పుడూ నగలపై వ్యామోహం పెంచుకోరా? అంటూ వ్యాఖ్యానించారు. ఆ మాటలు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అటు తరువాత ఎప్పుడూ బంగారు ఆభరణాలు ధరించలేదు. చిన్న కుమార్తె పసల క్రిష్ణభారతి చెవులు సైతం కుట్టించలేదు. అంజలక్ష్మి వడికిన నూలు వస్త్రాలు, ఖద్ధరు చీరనే ధరించే వారు. విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందున క్రిష్ణమూర్తి దంపతులను బ్రిటీష్ పాలకులు జైలుకు పంపించారు. నాలుగేళ్ల కుమారుడ్ని చంకలో పెట్టుకొని అంజలక్ష్మి జైలుకు వెళ్లారు.
Also Read: BJP vs KCR: కేసీఆర్ పై ప్రతీకారానికి ‘ఈటల’నే బీజేపీ అస్త్రం
కీలక భూమిక..
జైలు నుంచి తిరిగి వచ్చిన క్రిష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించారు. శాసనోల్లంఘన కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఉద్యమాన్ని తట్టిలేపారు. ఈ క్రమంలో భర్తకు అంజలక్ష్మి ఇచ్చిన ప్రోత్సాహం మరువరానిది. భీమవరంలో శాసనోల్లంఘన సమావేశం నిర్వహించాలని క్రిష్ణమూర్తి గట్టిగా నిర్ణయించుకున్నారు. దానిని ఎలాగైనా అడ్డుకోవాలని బ్రిటీష్ పాలకులు భావించారు. కానీ పోలీసుల కళ్లుగప్పి భీమవరం చేరుకున్న క్రిష్ణమూర్తి, ఇతర ఉద్యమకారులు సమావేశం నిర్వహించారు. ఓ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసి వందేమాతరం అని నినదించారు. ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అంజలక్ష్మితో పాటు మహిళలు నిలువురించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అంజలక్ష్మి ఆరు నెలల గర్భిణీ. ఆమెకు పది నెలల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వెల్లూరు జైలులో అంజలక్ష్మిని పెట్టారు. 1932 అక్టోబరు 29న ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. క్రిష్ణుడిలా కారాగారంలో పుట్టినందున ‘క్రిష్ణ’..భారతావనిని విదేశీయుల నుంచి విముక్తి కలిగించే పొరాటంలో భాగమైనందున ‘భారతి’ని కలిపి క్రిష్ణభారతిగా నామకరణం చేశారు. పది నెలల జైలు శిక్ష అనంతరం అంజలక్ష్మి శిశువుతో బయటకు వస్తే ప్రజలు నీరాజనం పలికారు. క్రిష్ణమూర్తి దంపతులు స్వాతంత్రోద్యమంలోనే కాదు.. సామాజిక రుగ్మతలపై సైతం అలుపెరగని పోరాటం చేశారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. దళిత, అణగారిన వర్గాలపై ప్రేమను చూపేవారు.కుల నిర్మూలనకు పాటుపడ్డారు. తమకున్న 60 ఎకరాలను పీడిత వర్గాల ప్రయోజనాల కోసమే వినియోగించారు. 1978లో క్రిష్ణమూర్తి చనిపోయారు. 1998లో అంజలక్ష్మి దివికేగారు.
Also Read: Rashmika Mandanna: స్పెషల్ సాంగ్ కి సై.. విజయ్ దేవరకొండ కోసమేనా ?