
ఏపీలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఉద్యోగులు, ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్లను కొట్టివేసింది. సుప్రీంకోర్టులో ఎలాగైనా పంచాయితీ ఎన్నికలకు స్టే వస్తుందని ఆశపడ్డ జగన్ సర్కార్ కు ఆశాభంగమైంది. ఈ పరిణామం ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు షాకింగ్ గా మారింది.
ఇక సుప్రీంకోర్టు ఈ తీర్పులో ఉద్యోగ సంఘాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ పార్టీలతో సమానంగా ఎన్నికల కమిషనర్ ను టార్గెట్ చేస్తూ ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. అవసరమైతే సమ్మెకు దిగుతామంటూ ఎన్నికల కమిషనర్ ను బెదిరించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఉద్యోగ సంఘాలపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సుప్రీంకోర్టు తీర్పుకు ముందు ఎంతో ఆవేశంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాలు.. తీర్పు తర్వాత కాస్త మెత్తబడ్డట్టు కనిపించాయి. సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ముందు, అవసరమైతే మెరుపు సమ్మెకు దిగుతామని చెప్పిన ఉద్యోగ సంఘాలు.. తీర్పు తర్వాత మాత్రం ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకం కాదు అని.. ఎవరిని బలవంతం పెట్టవద్దని మాత్రమే తాము కోరుకుంటున్నామని చెప్పారు. బలవంతంగా ఉద్యోగులని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చేయవద్దని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే ఏపీ ఉద్యోగులు సైతం ఇప్పుడు మెత్తబడి ఏపీలో పంచాయితీ ఎన్నికలకు రెడీ అయనట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ సర్కార్ మాత్రం దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికలకు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న ఏపీ సీఎం జగన్, అధికారులు ఈ తీర్పుతో ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా ఏదైనా మెలిక పెడుతారా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే సుప్రీం తీర్పు తర్వాత జగన్ సర్కార్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో తప్పనిసరిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సిన విషమ పరిస్థితి జగన్ సర్కార్ కు ఎదురైంది.
అయితే జగన్ సర్కార్ ముందుకు రాకున్నా కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ ఎన్నికల విధుల నిర్వహణకు కావాల్సిన ఉద్యగులపై ఏకంగా కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్రసిబ్బందిని కేటాయించాలని కోరారు. ఏపీ ఉద్యోగులు ముందుకు రాకుంటే కేంద్ర ఉద్యోగులతో ఎన్నికల నిర్వహణకు రెడీ అయ్యారు. సీఎస్, డీజీపీ కూడా వ్యతిరేకంగా ఉండడంతో కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఈ వివాదాన్ని తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టు తీర్పును జగన్ సర్కార్, ఉద్యోగులు ధిక్కరిస్తే తీవ్ర సంక్షోభంలో రాజ్యాంగం పడిపోతుంది. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఉద్యోగులను వినియోగించుకునే అవకాశాన్ని నిమ్మగడ్డ పరిశీలిస్తున్నారు. పోలీసులు కూడా సహకరిస్తారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది.