PM Modi: సాధారణంగా న్యాయస్థానాల తీర్పు అనుకూలంగా వస్తే మోదం.. ప్రతికూలంగా వస్తే ఖేదంగా కనిపిస్తాయి. ఇది సర్వసాధారణం. వ్యక్తులైనా, వ్యవస్థలైనా, చివరకు ప్రభుత్వాలైనా కోర్టుల తీర్పును శిరసావహించడం తప్పనిసరి. అయితే కింది కోర్టుల తీర్పులను సవాల్ చేస్తూ పై కోర్టులను ఆశ్రయించుకునే వెసులబాటు ఉంటుంది. కానీ కేంద్ర అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే మనకు ఫైనల్. అక్కడ వచ్చే తీర్పును తప్పనిసరిగా పాటించాల్సిందే. దానికి మించి మరో మార్గం లేదు. అయితే ఇటీవల ప్రభుత్వాలకు కోర్టులో ప్రతికూల తీర్పులు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రధాని మోదీకి ఊరట కలిగించే తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో కేంద్ర పెద్దలు ఎంతగానో ఖుషీ అవుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర నిఘా సంస్థలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని.. ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ వంటి సంస్థలను పురమాయించి విపక్ష నేతలను వేధిస్తున్నారని.. వారి కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు జరిపించి వారి ఆత్మాభిమానంపై దెబ్బకొడుతున్నారని.. మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్న అపవాదు అయితే ఉంది. అందులో వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు కొన్నేళ్లుగా జరిగిన పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి.

విపక్ష నేతలపై కుట్ర…
ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేసు నమోదుచేశారు. రెండు సార్లు విచారణ పేరిట పిలిపించారు.కొన్ని గంటలపాటు విచారించారు. దీనిపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపడుతూ వస్తోంది. అటు రాహుల్ గాంధీ ని కూడా అరెస్ట్ చేశారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలపై సైతం నిత్యం ఈడీ దాడులు జరుగుతున్నాయి.. అందులో కేంద్ర పెద్దలకు వ్యతిరేకంగా ఉన్నవారిపై అధికంగా జరుగుతున్నాయి. దీంతో ప్రధాని మోదీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర నిఘా సంస్థల సాయంతో దారికి తెచ్చుకుంటున్నారన్న టాక్ అయితే మాత్రం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రిం కోర్టు తీర్పు ఒకటి మోదీకి అనుకూలంగా వచ్చింది. సంచలనాత్మక తీర్పు వెలువరించింది. మనీలాండరింగ్ కేసులో కీలక నిబంధనలను కోర్టు సమర్థించింది. అందులో ఉన్న పలు నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను తోసిపుచ్చుతూ తీర్పును వెల్లడించింది.
కోర్టు కీలక వ్యాఖ్యలు..
మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ తన దర్యాప్తులో భాగంగాచేసే సోదాలు, అరెస్టులు, ఆస్తుల సీజ్ లు వంటి వాటిని కూడా కోర్టు సమర్థించింది. కారణాలు చెప్పకుండా నిందితులను అరెస్ట్ చేసే విధానం సరికాదని.. ఆ అధికారం ఈడీకి లేదన్న పిటీషనర్ల వాదనను సైతం కొట్టిపారేసింది. విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు చెప్పించి నమోదు చేయిస్తోందన్న కార్తీ చిదంబరం, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వంటి పిటీషన్లు కోర్టు దృష్టికి తీసుకురాగా..ఆ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఎన్ ఫోర్సుమెంట్ కేసు నివేదిక ఎఫ్ఐఆర్ తో సమానమని కోర్టు చెప్పింది. దానిని బయటకు నివేదించాల్సిన పనిలేదని తేల్చింది. అంతే కాకుండా బలవంతంగా వాంగ్మూలం సేకరించడం వ్యక్తి హక్కను హరించడమేనని.. జీవించే హక్కు కాలరాయడమేనన్న పిటీషనర్ల వాదనతో ఏకీభవించలేదు. దేశ సౌభ్రతృత్వాన్ని, సమైక్యతను కాపాడేందుకు ఇటువంటి విషయాల్లో గోప్యత అవసరమని కూడా అభిప్రాయపడింది. ఆర్థిక నేరాట కట్టడికి ఒత్తిడితో కూడిన విచారణ అవసరంగా పేర్కొంది. మొత్తానికైతే కేంద్ర నిఘా సంస్థలతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు బీజేపీ నేతలకు సంతోషాన్నిచ్చింది.