MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.. ఐదు నెలలకు పైగా ఆమె తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం ఆమె పలుమార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈడి అదనపు చార్జి షీట్లు దాఖలు చేయడంతో ఆమెకు కోర్టు బెయిల్ నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల మళ్ళీ ఆమె బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంగళవారం సుప్రీంకోర్టులో ఈడీ, కవిత తరఫున న్యాయవాదులు వాడీవేడిగా వాదనలు వినిపించారు. గత 162 రోజులుగా ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉంటున్నందని.. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగడం లేదని.. కేవలం ఆమె ప్రభావంతమైన మహిళ అనే అక్కసుతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయని.. ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని.. ఆమె తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గీ వాదించారు.
ఫోన్ల ధ్వంసం పై ప్రధాన చర్చ
బెయిల్ విచారణలో భాగంగా ప్రధానంగా కవిత ఫోన్లు ధ్వంసం చేశారనే అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది ..” కవిత మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. అందువల్లే ఆమె మెసేజ్ లు తొలగించారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నుంచి నోటీసులు రావడంతోనే ఆమె ఫోన్లను ధ్వంసం చేశారు.. ఫోన్లను ఫార్మాట్ చేసే పని ఇంట్లో వాళ్లకు అప్పగించారు. సాక్ష్యాలను కూడా ఆమె తారుమారు చేశారు. ఫోన్లో ఉన్న సమాచారాన్ని కూడా పూర్తిగా తొలగించారు. విచారణ సమయంలో కవిత మాకు సహకరించలేదు.. చివరికి అరుణ్ పిళ్లై ని కూడా కవిత ప్రభావితం చేశారు. అతడు జైల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభావితం చేశారు.. ఈ కేసులో మరో నిందితుడు ముత్తా గౌతమ్ ఉన్నప్పటికీ.. అరుణ్ అనే వ్యక్తి డమ్మీ మాత్రమే.. అసలు వాటాదారు కవిత అని” ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తరపు న్యాయవాది వాదించారు.. అయితే ఇదే సమయంలో “కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదు?, అప్రూవర్ తన స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఫోన్ లో మెసేజ్ లు తొలగించడం సహజమే కదా.. ఫోన్లో సమాచారం ఎక్కువగా ఉన్నప్పుడు డిలీట్ చేస్తారు కదా” అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
కవిత తరపు న్యాయవాది ఏమన్నారంటే..
మరోవైపు కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో ధాటిగా వాదించారు. ” దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత అప్పగించారు.. ఈ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారు. ఇప్పటివరకు 493 మంది సాక్షులను విచారించారు. కేసులో ఛార్జ్ షీట్ లను కూడా దాఖలు చేశారు. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదు.. ఎన్ ఫోర్స్ మెంట్, సీబీఐ ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తి చేసింది. ఒక మహిళగా కవిత మెయిల్ పొందేందుకు అర్హురాలు. 100 కోట్ల ముడుపులు అనే ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు. కవిత నుంచి ఇప్పటివరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదు. పైగా కవిత ఎవరిని కూడా బెదిరించలేదు. ఇదే కేసులో ఇప్పటికే మనిష్ సిసోడియాకు బెయిల్ మంజూరు అయింది. అతడికి వర్తించిన నిబంధనలు కవితకు వర్తిస్తాయని” ముకుల్ రోహత్గీ వాదించారు.
గవాయ్ ధర్మాసనం ఏం వ్యాఖ్యానించిందంటే..
అయితే ఆయన వాదిస్తున్న సమయంలో గవాయ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది..”అప్రూవల్ స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారు? కవిత నిరక్షరాస్యురాలు కాదు కదా? ఏది మంచో, ఏది చెడో ఆమెకు తెలియదా? కవిత దుర్బల మహిళ కాదు కదా” అంటూ జస్టిస్ గవాయి ధర్మాసనం వ్యాఖ్యానించింది.