ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఆ తర్వాత కేంద్రం పై కూడా అసహనం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం కింద అధికారులు ఉన్నప్పటికీ ఈఎంఐ విషయంలో ప్రజలకు ఉన్న సమస్యలకు ఆర్బిఐ ని సాకుగా చూపడం తగదని హితవు పలికింది. కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించింది కేంద్రం కాబట్టి ప్రజలకు రిలీఫ్ కల్పించే విషయంలో వారికి వచ్చిన కష్టాల విషయంలో కూడా కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు చెల్లించే వివిధ ఈఎంఐలపై రెండు విడతలుగా ఆరునెలలపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
అయితే బ్యాంకులు మాత్రం ఆరు నెలలపాటు ఈఎంఐ మాత్రమే చెల్లించక్కర్లేదని… కానీ లోన్ ఆపిన కాలానికి వడ్డీ చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశాయి. దీనివల్ల ఈఎంఐ వ్యవధి మాత్రమే పెరుగుతుందని పేర్కొన్నాయి. దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అయినప్పటికీ అలా చేస్తే బ్యాంకుల విపరీతంగా నష్టపోతాయని అందువల్ల కచ్చితంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ వివరించింది. కేంద్రం కూడా ఈ విషయంలో స్పష్టంగా తన నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆర్బీఐకి వదిలేసింది
ఈ నేపథ్యంలో దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్నీ సమస్యలకు ఒకేరకమైన పరిష్కారం ఉండదని…. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ వినిపించిన వాదనలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
“మీరు విధించిన లాక్ డౌన్ వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కూడా వ్యాపారాత్మక ధోరణి వీడి ప్రజల కష్టాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికింది. విపత్తుల నిర్వహణ చట్టం అమలుతో పాటు ఈఎంఐ వడ్డీ చెల్లింపు విషయంలో వైఖరి ఏమిటో చెప్పాలని ఆదేశించింది. అందుకు వారం రోజులు గడువు కావాలని సొలిసిటర్ జనరల్ కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. సెప్టెంబరు 1కి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని పేర్కొంది.