Rajinikanth- Chandrababu: చంద్రబాబుకు దేశవ్యాప్తంగా నాయకులు మద్దతు తెలుపుతున్నారు. అరెస్ట్ ను ఖండిస్తున్నారు. ముఖ్యంగా విపక్ష ఇండియా కూటమికి చెందిన నాయకులు చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ ఉండడం విశేషం. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ స్పందించారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంఘీభావం తెలిపినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు, రజనీకాంత్ ల మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సందర్భాల్లో రజనీకాంత్ తమ స్నేహం గురించి చెప్పుకొచ్చారు. చంద్రబాబు తాను అభిమానించే మిత్రుల్లో ముందు వరుసలో ఉంటారని ప్రకటించారు. మొన్నటికి మొన్న చంద్రబాబు ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఆ వేదికపై చంద్రబాబును ఉద్దేశించి రజనీ చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టించాయి. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ ను టార్గెట్ చేసుకుని స్థాయికి మించి వ్యాఖ్యలు చేశారు. అయినా సరే తాజాగా చంద్రబాబు అరెస్టును తెలుసుకున్న రజినీకాంత్ స్పందించడం విశేషం.
ప్రస్తుతం సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న రజనీకాంత్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. ఆయన కుమారుడు నారా లోకేష్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడిని లోకేష్ కు ధైర్యం చెప్పారు. ” చంద్రబాబు ఎప్పుడు తప్పు చేయరు. చేసినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు. చేసిన మంచి పనులు, ప్రజాసేవ ఆయన్ను బయటికి తీసుకొస్తాయి ” అని రజనీకాంత్ పేర్కొన్నట్లు లోకేష్ ధ్రువీకరించారు.
ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నాయకులు.. మరోసారి రజనీకాంత్ ను వెంటాడుతారా అన్న అనుమానం కలుగుతోంది. ఎన్టీఆర్ శతజయంతి సమయంలో రజనీకాంత్ చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రజనీకాంత్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై స్పందించిన రజనీకాంత్… గతం మాదిరిగానే వ్యాఖ్యానించారు. చంద్రబాబును మహాయోధుడిగాను పోల్చారు. ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మాట్లాడారు. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.