Rajinikanth- Chandrababu: ఏపీ రాజకీయాలు రసవత్తర మలుపు తిరుగుతున్నాయి. చంద్రబాబు, పవన్ భేటీతో కొత్త చర్చలకు తెరలేసింది. ఆ వెంటనే చంద్రబాబుతో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ వేదికగా జరిగిన కలయికలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. చంద్రబాబు, పవన్ భేటీ పై స్పష్టత ఉన్నా.. తలైవర్ రజినీకాంత్ కలయిక మాత్రం కొత్త చర్చలకు దారితీస్తోంది.

కుప్పంలో చంద్రబాబు పై ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు మద్దతుగా పవన్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం దమనకాండను నిరసించారు. ఈ భేటీ కొత్త పొత్తులకు దారితీయనుందన్న చర్చలు నడుస్తున్నాయి. ఇదే సందర్భంలో పవన్, చంద్రబాబు భేటీ ముగిసిన మరుసటి రోజే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబును కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ లో ఉన్న రజినీకాంత్ చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అవ్వడం కొత్త్ చర్చకు దారితీస్తోంది.
గతంలో సొంత పార్టీ పెట్టాలని ప్రయత్నించిన రజినీకాంత్ .. తర్వాత ఆ ప్రయత్నాలు నిలిపేశారు. బీజేపీతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో రజినీకాంత్ భేటీ పట్ల రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. బీజేపీ దూతగా వచ్చారా ? లేక మర్వాదపూర్వకంగా కలిశారా అన్న చర్చ జరుగుతోంది. పవన్ భేటీ తర్వాత చంద్రబాబు రజినీకాంత్ ని కలవడం .. టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుకు అడుగులు పడనున్నాయా ? అన్న చర్చ మొదలైంది. ఇదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి.

చంద్రబాబుతో రజినీకాంత్ భేటీ పై అధికార వైసీపీ ఇంకా స్పందించలేదు. వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉంటే ఖచ్చితంగా వైసీపీ గుండెల్లో గుబులు పుడుతుంది. పవన్ , చంద్రబాబు కలయికను తీవ్రంగా విమర్శించిన వైసీపీ.. రజినీకాంత్ భేటీ పై ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.