https://oktelugu.com/

Telangana Excise Policy : చెప్పుకొంటే సిగ్గు పోతుంది.. చెప్పకపోతే ఉద్యోగం పోతుంది

. ఇంతటి దీన స్థితి ఏ ప్రభుత్వ ఉద్యోగికీ రాకూడదని ఎక్సైజ్‌ ఉద్యోగులు గొణుక్కుంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఉన్నతాధికారులు కన్నెర్ర చేస్తారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 17, 2023 9:23 pm
    Follow us on

    Telangana Excise Policy : ‘కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్‌..’ అన్నాడు మద్యానికి బానిసయిన దేవదాసు అలియాస్‌ అక్కినేని నాగేశ్వరరావు. తాగేసిన మత్తులో అలాంటి పాటలు పాడేవాళ్ల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి సంపూర్ణ మద్య నిషేధాన్ని సాధించాల్సిన ‘మద్య నిషేధం, ఆబ్కారీ శాఖ’ కుడి.. ఎడమే అయ్యింది! మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఆ శాఖే ఇప్పుడు.. సర్కారువారి పుణ్యమా అని ‘మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రోత్సాహక శాఖ’ అవతారం ఎత్తింది. రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వేట.. ఆ శాఖ అధికారులకు సంకటంగా మారడంతో.. వారు నానా తంటాలూ పడుతున్నారు. ఒకప్పుడు అక్రమ మద్యం విక్రయించే కిరాణా షాపులు, పాన్‌ షాపుల వారిని బెల్ట్‌ షాపులంటూ కంటిచూపుతో బెదిరించి, తాట తీసిన అధికారులే.. ఇప్పుడు అదే వ్యాపారుల చేతులు, గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు. ‘‘బాబ్బాబు.. మీకు పుణ్యముంటుం ది. వైన్‌ షాపు కోసం ఒక్క దరఖాస్తు చేసుకోండి ప్లీజ్‌’’ అంటూ అడుగుతున్నారు.

    కాళ్లబేరానికి దిగుతున్నారు

    ‘‘చెప్పుకొంటే సిగ్గు పోతుంది.. చెప్పకపోతే ఉద్యోగం పోతుంది.. అంచేత చెప్పక తప్పట్లేదు’’ అంటూ సిగ్గువిడిచి కాళ్లబేరానికి దిగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎక్సైజ్‌ ఉద్యోగుల పరిస్థితి ఇది. జిల్లాల్లోని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు ఇప్పుడు బెల్ట్‌ షాపుల వారికి లీగల్‌గా బిజినె్‌సలోకి లాగే పనిలో బిజీగా ఉన్నారు. కార్యాలయాల వద్ద దరఖాస్తుదారులకు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారుల దృష్టిలో వైన్‌ షాపు కోసం దరఖాస్తు చేసేవారు ఆపద్బాంధవులు అయ్యారు. ఇంతటి దీన స్థితి ఏ ప్రభుత్వ ఉద్యోగికీ రాకూడదని ఎక్సైజ్‌ ఉద్యోగులు గొణుక్కుంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఉన్నతాధికారులు కన్నెర్ర చేస్తారు. దాంతో మనసు చంపుకొని బతిమాలే డ్యూటీ చేస్తున్నారు. పదిహేను రోజులుగా తాము చేస్తున్న పని అత్యంత నీచంగా ఉందని వాపోతున్నారు.

    2000 కోట్లు రాబట్టేందుకు..

    రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నెల 4 నుంచి 18 వరకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేశారు. కానీ… మరి న్ని దరఖాస్తులు వస్తే… ఖజానా నిండుతుందన్న భావనతో ప్రభుత్వం… ఎక్సైజ్‌ అధికారులకు రకరకాల సూచనలు చేస్తోంది. ఈ దరఖాస్తుల అమ్మకం ద్వారానే రూ.2000 కోట్లు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకనుగుణంగా రోజుకో సూచన చేస్తూ అధికారులను క్షేత్ర స్థాయికి పంపిస్తోంది. ఒక్కో షాపునకు కనీసం 20 దరఖాస్తులు వస్తేనే లక్కీ డీప్‌ తీస్తామంటూ ఇటీవల అధికారులు కొత్త నిబంధన విధించారు. ప్రస్తుతం ఒక్కో దరఖాస్తు ఖరీదు రూ.2 లక్షలు. అంటే… ఒక్కో షాపు ద్వారా కనీసం రూ.40 లక్షలను రాబట్టాల్సిందే. ఈ నిబంధన టెండర్ల సందర్భంలో లేదు. కొత్తగా పెట్టడం ద్వారా టెండర్‌ నిబంధనలను ఉల్లంఘించారని ఔత్సాహిక పోటీదార్లు వాపోతున్నారు. ఎక్సైజ్‌ అధికారులు తమకు అప్పగించిన ‘టాస్క్‌’ కోసం రాత్రనకా పగలనకా కష్టపడుతున్నారు. జిల్లాలు, స్టేషన్ల పరిధిలోని వ్యాపారులతో సమావేశమవుతూ దరఖాస్తు చేయించే పనిలో పడ్డారు. ఒక్కో షాపునకు సాధ్యమైనంత ఎక్కువ దరఖాస్తులను రాబట్టాలని, అందుకోసం స్థానిక వ్యాపారులతో సామావేశాలు నిర్వహించాలంటూ ఇటీవల ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక అధికారులు… తమ పరిధిలోని కిరాణా షాపులు, హార్డ్‌వేర్‌ షాపుల వ్యాపారులు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారితో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు.