‘పున్నమి’ సాయం.. కదిలిన నౌకాసౌధం

సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన భారీ నౌక ఎవర్‌‌ గివెన్‌ అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆరు రోజులుగా ఎటూ కదల్లేక అక్కడే ఉండిపోయింది. దీంతో ఆరు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సోమవారం ఫలించాయి. దీంతో ప్రపంచం మొత్తం ఊపిరి తీసుకుంది. నౌక ముందుభాగం కూరుకుపోయిన చోట ఇసుక, మట్టిని డ్రెడ్జర్లు తవ్వుతుండగా.. పది టగ్‌ బోట్లు నౌకను కదిలించే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో నౌక కింద నీటిని పంప్‌ చేయగా.. వీటికి సముద్రపు […]

Written By: Srinivas, Updated On : March 30, 2021 1:46 pm
Follow us on

సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన భారీ నౌక ఎవర్‌‌ గివెన్‌ అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆరు రోజులుగా ఎటూ కదల్లేక అక్కడే ఉండిపోయింది. దీంతో ఆరు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సోమవారం ఫలించాయి. దీంతో ప్రపంచం మొత్తం ఊపిరి తీసుకుంది. నౌక ముందుభాగం కూరుకుపోయిన చోట ఇసుక, మట్టిని డ్రెడ్జర్లు తవ్వుతుండగా.. పది టగ్‌ బోట్లు నౌకను కదిలించే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో నౌక కింద నీటిని పంప్‌ చేయగా.. వీటికి సముద్రపు పోటు సహకరించింది. దీంతో నౌక పాక్షికంగా, ఆ తర్వాత పూర్తిగా సవ్యదిశలోకి వచ్చింది.

ప్రస్తుతం ఎవర్ గివెన్ ప్రయాణం సాఫీగా సాగుతోందని ఈజిప్టు సూయజ్ కాలువ యంత్రాంగం వెల్లడించింది. నౌక పునరుద్ధరణ చర్యల్లో భాగంగా 18 మీటర్ల లోతులో 27 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తొలగించారు. గత మంగళవారం నౌక సూయజ్‌ కాలువలో ప్రయాణిస్తుండగా భారీ గాలులకు అడ్డం తిరిగి, దాని ముందుభాగం ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ‘పుల్‌-పుష్‌ ప్రయత్నాలకు ఎవర్‌ గివెన్‌ బాగా స్పందించింది. అడ్డంగా ఉన్న ఈ నౌకను 80 శాతం సాధారణ స్థితికి తీసుకొచ్చాం. తర్వాత పూర్తిగా నీటిపై తేలింది.. ఇరుక్కున్న ప్రాంతం నుంచి 102 మీటర్లు (335 అడుగులు) ముందుకు కదిలింది’ అని సూయిజ్‌ కెనాల్‌ అథారిటీ చీఫ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఒసామా రబీ ఓ ప్రకటనలో తెలిపారు.

మార్చి 23 నుంచి ఈ కాలువలో ట్రాఫిక్ జామ్ కావడంతో 450 నౌకలు ఆ మార్గంలో నిలిచిపోయాయి. ఈ నౌకలన్నీ చమురు, సరుకులు, పశువులను తరలిస్తున్నవే. ప్రస్తుతం నౌక సాధారణ స్థితికి వచ్చి సమస్య పరిష్కారమైనప్పటికీ పూర్తిస్థాయిలో రవాణా పునరుద్ధరణకు కనీసం పది రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మరికొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం ఆరంభించాయి. సూయజ్ కాలువ నియంత్రణ బాధ్యతలను ఈజిప్టు నిర్వహిస్తుండటంతో ఆ దేశానికి రోజుకు 14 మిలియన్ డాలర్లు మేర నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో దాదాపు 95 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.710 కోట్ల) వరకు కోల్పోయింది.

ప్రపంచ మొత్తం వాణిజ్యంలో 12 శాతం సూయజ్ కాలువ గుండానే జరుగుతుంది. కరోనా కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థ కుచించుకుపోగా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు దాదాపు వారం రోజులు సూయజ్ కాలువలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. పలు నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగే ప్రయాణాన్ని ఎంపిక చేసుకున్నాయి. ఈ సుదీర్ఘ మార్గంలో ప్రయాణ ఖర్చులు తడిసిమోపుడవుతాయి.

మరోవైపు.. నిండు పున్నమి ప్రభావంతో కాలువలో ఎగిసిన అలలు.. ఇసుకలో కూరుకున్న నౌకను నీటిపైకి లేపాయని సహాయక బృందాలు తెలిపాయి. నౌకను కదిలించే ప్రయత్నాల్లో పౌర్ణమి వల్ల ఏర్పడిన సముద్రపు పోటు అపారంగా సాయపడిందని సహాయక బృందాలు ప్రకటించాయి. చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల సముద్రంలో కెరటాలు, ఆటోపోట్లు ఏర్పడుతుంటాయి. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య ఘడియల్లో అలల తీవ్రత విపరీతంగా ఉంటుంది. గత ఆదివారం పౌర్ణమి కావడంతో సూయిజ్‌ కాలువలోనూ అలలు పోటెత్తాయి. ఈ పోటు ఎవర్‌‌ గివెన్‌ నీటిలో నుంచి బయటకు వచ్చేందుకు సాయపడిందని బృందాలు చెప్పాయి.

అయితే.. నౌక నీటిపై తేలిన తర్వాత దాన్ని తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకురావడం కూడా చాలా కష్టమైన పని అని రెస్క్యూ టీం సంస్థ బొస్కాలిస్‌ వెస్ట్‌ మినిస్టర్‌‌ సీఈవో పీటర్‌‌ బెర్డోస్కీ అన్నారు. ‘ఓడ నీటిపై పూర్తిగా తేలిన తర్వాత టెన్షన్‌ మరింత ఎక్కువైంది. ఎందుకంటే ఎవర్‌‌ గివెన్‌ కాలువకు ఉన్న మరో భాగానికి తాకకుండా టగ్‌బోట్ల సాయంతో దాన్ని నిలువుగా తీసుకురావాలి. లేదంటే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. నౌకను సాధారణ స్థితికి తీసుకొచ్చే ఆ పది నిమిషాలు అందరిలోనూ టెన్షన్‌ ఎక్కువైంది’ అని పీటర్‌‌ తెలిపారు. మొత్తానికి తమ ప్రయత్నాలు ఫలించి.. నౌక కాలువలో ముందుకు కదిలిందని చెప్పుకొచ్చారు.