
ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర దినోత్సవ వేళ.. పట్టపగలు ఓ యువతిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడో ఉన్మాది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. గతంలో విజయవాడలో శ్రీలక్ష్మిని నరికి చంపిన ఉదంతం కళ్ల ముందు కదలాడింది. ఇలాంటి దారుణాలు అడ్డుకట్ట వేసేందుకని చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ సర్కారు దిశ బిల్లును ఆమోదించింది. హైదరాబాద్‌లో జరిగిన దిశ దారుణం తర్వాత.. 2019 డిసెంబర్ 13న ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. అయితే.. ఈ బిల్లు గురించి జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
దిశ బిల్లు ప్రకారం.. మహిళలపై అత్యాచార ఘటనలు, లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుల్లో కేవలం 14 రోజుల్లోనే పోలీసులు విచారణ పూర్తి చేస్తారు. ఇందుకోసం సీఆర్పీసీ, ఐపీసీ సెక్షన్లలోనూ మార్పులు చేశారు. తద్వారా.. ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే వర్తించేలా 354E, 354G సెక్షన్లు కొత్తగా చేర్చారు. 2019లో ఈ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించినప్పటికీ.. ఇంకా చట్టంగా మారలేదు. కారణం.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడమే. ఇండియన్ పీనల్ కోడ్ నే మార్చాల్సిన పరిస్థితి రావడంతో.. ‘దిశ’బిల్లు ఎటూ తేలట్లేదు.
కేవలం.. ఒక్క రాష్ట్రం కోసం భారతీయ శిక్షా స్మృతిని మార్చడానికి కేంద్రం సుముఖంగా లేదని, అందుకే.. పలు మార్పులు సూచిస్తూ.. గత అక్టోబర్‌లో ఆ బిల్లును కేంద్ర సర్కారు వెనక్కి పంపించిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 354కి యాడ్ చేసిన మరికొన్ని సెక్షన్ల అమలుకు అంగీకరిస్తే.. భవిష్యత్ లో మిగిలిన రాష్ట్రాల నుంచి ఈ తరహా డిమాండ్లు రావొచ్చని కేంద్రం భావిస్తుండొచ్చని అంటున్నారు.
నేరం జరిగిన తర్వాత 14 రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేసి, 21 రోజుల్లోగా నిందితుడికి శిక్ష పడేలా దిశ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. మహిళలు, పిల్లలపై లైంగిక నేరానికి పాల్పడేతే జీవితఖైదు, ఉరి శిక్షకూడా వేయొచ్చు. మహిళలు, పిల్లలపై నేరాలను వేగంగా విచారించేందుకు దేశంలోనే మొదటి సారిగా జిల్లాకు ఒక స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం ద్వారా వీలు కల్పించారు. నిందితులు పైకోర్టుకు వెళ్లి అప్పీలుకు వెళ్లే గడువును మూడు నెలలకు తగ్గించారు. విచారణ, తీర్పులో వేగం కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లని, కోర్టులను ఏర్పాటు చేసేందుకు దిశ బిల్లు అవకాశం ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి తిరిగి వచ్చిందని చెబుతున్న దిశ బిల్లులో కేంద్రం సూచించిన మార్పులను రాష్ట్రం అంగీకరించి, శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపితే.. కేంద్రం ఓకే చెప్పి రాష్ట్రపతికి పంపింతే.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. అప్పుడు చట్టంగా మారుతుంది.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటి నుంచో ప్రచారం చేసుకుంటోంది. దిశ చట్టం, దిశ యాప్ అంటూ తాను చెప్పాల్సింది చెబుతోంది. ఆపదలో ఉన్న అమ్మాయిలను పోలీసులు త్వరగా ఆదుకునేందుకు.. ‘దిశ’ యాప్ ను ఈ మధ్యనే రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రమాద సమయంలో ఈ యాప్ ఎలా ఉపయోగ పడుతుందనే విషయాన్ని ఇంటింటికీ వెళ్లి నేర్పించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులు, సిబ్బందికి సూచించారు కూడా. అయితే.. ఎన్ని చేసినా.. అమ్మాయిలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయన్నది వాస్తవం. అర్ధరాత్రి స్వాతంత్రం సంగతి పక్కన పెడితే.. పట్టపగలు నడిచే స్వేచ్ఛ కూడా లేదని, తమ బతుకు తాము జీవించే హక్కు కూడా లేదని స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగిన దుర్ఘటన ఈ వ్యవస్థను వేలెత్తి చూపిస్తోందన్నది యథార్థం.
దిశ చట్టం తేవాలనే ఆలోచన మంచిదే అయినా.. చిత్త శుద్ధితో వ్యవహరిస్తే.. ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయన్నది మెజారిటీ జనం సూచన. నిర్భయ ఘటన తర్వాత తెచ్చిన చట్టంతో వచ్చిన మార్పు ఏంటీ అన్నప్పుడు.. చెప్పడానికి సరైన సమాధానం కనిపించదు. రేపు దిశ బిల్లు చట్టంగా మారినా.. ఇలాంటి దారుణాలు ఆగుతాయని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందువల్ల ప్రభుత్వం, చట్టం చేయాల్సింది.. ఉన్న చట్టాలను పడ్బందీగా అమలు చేయడమే. తప్పు చేస్తే.. శిక్ష తప్పదన్న భయం కలిగించడమే. సకాలంలో బాధితుల పక్షాన స్పందించడమే. ఇవి చేయనప్పుడు.. ఎన్ని నిర్భయ చట్టాలొచ్చినా.. మరెన్ని దిశ చట్టాలొచ్చినా ఉపయోగం లేదు. ఎంతో మంది నిర్భయలు, దిశలు బలైపోతూనే ఉంటారన్న సంగతి కలలో కూడా మరిచిపోకూడదు.