Vijay challenge to Stalin: కరూర్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట తర్వాత టీవీకే పార్టీ అధినేత విజయ్ తెరపైకి వచ్చారు. ఇప్పటికే ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు కమిషన్ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వపరంగా మృతులకు 10 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేసింది. గాయపడిన వారికి లక్ష చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. మృతుల సంఖ్య మొదట్లో 30 మంది అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ సంఖ్య మరింతగా పెరిగింది. మృతుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో.. తమిళనాడు మీడియా, జాతీయ మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చిన నేపథ్యంలో విజయ్ స్పందించారు. పార్టీ తరఫున చనిపోయిన వారికి 20 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.
ఇప్పుడు మరోసారి విజయ్ స్వీయ వీడియో ద్వారా బయటికి వచ్చారు. జరిగిన ఘటన గురించి.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాల గురించి.. తాను ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి విజయ్ కీలక విషయాలను వెల్లడించారు. “నాపై తమిళ ప్రజలు చూపించే ప్రేమ గొప్పగా ఉంటుంది. ఆ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందువల్లే నేను చేస్తున్న యాత్రలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గను. ఆ ఆలోచన నా మనసులో స్థిరంగా ఉంటుంది. అందువల్లే రాజకీయపరమైన అంశాలను కూడా పక్కనపెట్టి.. ప్రజలకు భద్రతాపరంగా మెరుగ్గా ఉండే ప్రాంతాలను మాత్రమే మేము యాత్రకు ఎంచుకున్నాం. నేను గడిచిన మూడు రోజులుగా మౌనంగా ఉంటున్నాను. అందువల్లే నేను అక్కడి నుంచి వెంటనే ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే కరూర్ ప్రాంతానికి వచ్చి వారిని పరామర్శిస్తాను” అని విజయ్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కి సవాల్
విజయ్ తన స్వీయ వీడియోలో ముఖ్యమంత్రి స్టాలిన్ కు నేరుగా సవాల్ చేశారు.” సీఎం గారు మీకు నా మీద వ్యక్తిగత ద్వేషం ఉంటే ప్రతికాలం తీర్చుకోండి. ఇంకా ఏదైనా సమస్య ఉంటే నాపై దానిని చూపించండి. అంతే తప్ప నా సహచరులను టచ్ చేయొద్దు. నేను ఇల్లు లేదా ఆఫీసులోనే ఉంటాను. ప్రభుత్వం మీది కాబట్టి ఏమైనా చేసుకోండి. నాకు కేటాయించిన స్థలంలోనే కేవలం లైట్ కింద మాట్లాడాను. అది నా తప్పు ఎలా అవుతుంది. నా పార్టీ నిర్వాహకులు, ఇతర సభ్యులు, సోషల్ మీడియాను పర్యవేక్షించే వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అరెస్టులు చేయడం సరికాదని” విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..
” నేను కూడా ఆ సమయంలో బాధపడ్డాను. కన్నీరు పెట్టాను. ఒకవేళ నేను గనుక అక్కడే ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది.. అందువల్లే నేను అక్కడి నుంచి మౌనంగా వెళ్లాల్సి వచ్చింది. నేను దాదాపు 5 జిల్లాలలో ప్రచారం చేశాను. ఏ జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరగలేదు. కానీ ఇక్కడ మాత్రమే ఎలా జరిగింది. అలా జరగడం వెనుక మాకు ఏదో అనుమానం కలుగుతోంది.. ప్రజలంతా చూస్తున్నారు.. జరిగిన దానిని గమనిస్తున్నారు.. కరూర్ ప్రజలతో నేను నిజాలు మాట్లాడినప్పుడు.. వాటిని వెల్లడించడానికి ముందుకు వచ్చినప్పుడు.. దేవుడే నాకు శక్తి ఇచ్చినట్టు అనిపిస్తోంది. అన్ని నిజాలు త్వరలోనే బయటికి వస్తాయని” విజయ్ పేర్కొన్నారు.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025