Undavalli Sridevi- Chandrababu: ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలుపును అంతా లైట్ తీసుకుంటారు. అధికారం చేతిలో ఉంటుంది కనుక దానిని ఒక సాధారణ విజయంగా చెప్పుకొస్తారు. అదే విపక్షంలో ఉన్న పార్టీ గెలిస్తే మాత్రం దానిని ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. ప్రజల మనసును గెలిచే పార్టీగా అభివర్ణిస్తారు. ఇలాంటి ఉప ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన వైసీపీ అనతికాలంలోనే అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్ సొంత పార్టీని పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీకి తాను, ఎమ్మెల్యే పదవికి తల్లి విజయమ్మతో రాజీనామా చేయించారు. అప్పుడే పురుడుబోసుకున్న తన పార్టీకి ఉప ఎన్నికతోనే ఊపు తెప్పించారు. ఐదు లక్షలకుపైగా మెజార్టీతో ఎంపీగా తాను.. 90 వేల మెజార్టీతో తల్లి విజయమ్మను విజయతీరాల వైపు నడిపించారు. ఆ రెండు ఉప ఎన్నికలతోనే వైసీపీ తెలుగునాట గట్టి పునాది వేసుకుంది. అటు తరువాత వచ్చిన ఉప ఎన్నికలను వైసీపీ పునాదులుగా మార్చుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఉప ఎన్నికలు అధికారంలోకి రావడానికి ఎంతగా అక్కరకు వస్తాయో వైసీపీ చేసి చూపించింది. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు అటువంటి అరుదైన అవకాశం దక్కింది. అదే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రూపంలో…
అమరావతికి జైకొట్టిన శ్రీదేవి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో వైసీపీ ఓడిపోయింది. దానికి క్రాష్ ఓటింగే కారణమని.. ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు టీడీపీ అభ్యర్థికి ఓటేశారని అనుమానించి వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తప్పుచేయలేదని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించుకున్నారు. పైగా వైసీపీ నుంచి దూరమైనందుకు స్వేచ్ఛ లభించిందని చెబుతున్నారు. అటు ఇన్నాళ్లూ అధికార పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయాల్సి వచ్చిందని.. ఇక నుంచి అమరాతి రాజధానికి వెన్నుదన్నుగా నిలుస్తానని శ్రీదేవి ప్రకటించారు. గత నాలుగేళ్లుగా సొంత ప్రాంతంలో రాజధాని ఉద్యమాన్ని శ్రీదేవి వ్యతిరేకించారు. ఇప్పుడు వైసీపీకి దూరమవ్వడం, టీడీపీకి దగ్గర కావడం, అమరావతికి మద్దతు పలకడం వంటి అంశాలతో శ్రీదేవితో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళితే ఎలా ఉంటుందోనని చంద్రబాబు ఆలోచిస్తున్నారుట. అదే జరిగితే టీడీపీ విజయపరంపర కొనసాగించడంతో పాటు అమరావతి సజీవంగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నారుట.
అన్ని పార్టీల మద్దతు…
అయితే ఇప్పుడు ఉప ఎన్నికకు ఉండవల్లి శ్రీదేవి సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. అగ్ర నాయకత్వానికి ధీటైన జవాబు ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే సరైన సమయంలో చంద్రబాబు ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అమరావతికి మద్దతిచ్చినందున.. రాజధాని ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా ఓటువేస్తారని.. పైగా జనసేన మద్దతిస్తుందని.. బీజేపీ, వామపక్షాలు సైతం మద్దితివ్వక తప్పని అనివార్య పరిస్థితి ఉన్నందున శ్రీదేవితో రాజీనామా చేయించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అదే కానీ జరిగితే వైసీపీకి కొత్త సవాలే. ఇప్పటికే అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు వైసీపీ సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారు. దీనికితోడు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంది. ఈ సమయంలో కానీ ఉప ఎన్నిక వస్తే మాత్రం అధికార పార్టీకి చుక్కలు కనిపించడం ఖాయం.
టీడీపీ కాకుంటే ఇండిపెండెంట్ గా…
మరోవైపు ఉండవల్లి శ్రీదేవి టీడీపీ క్యాండిడేట్ గా ఇతర పక్షాలు ఒప్పుకుంటాయా? అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన విజయం తనదేనన్న రేంజ్ లో టీడీపీ ఉంది. ఇప్పుడు తాడికొండ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆ క్రెడిట్ అంతా ఆ పార్టీకే దక్కుతుంది. మిగతా రాజకీయ పార్టీలకు ఖాతరు చేయని విధంగా టీడీపీ మారుతుంది. అందుకే విపక్షాలన్నీ ఒక డిమాండ్ ను తెరపైకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా, ఇండిపెండెంట్ గా శ్రీదేవిని తెరపైకి తేచ్చే అవకాశమే ఎక్కువ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతకీ శ్రీదేవికి ఉప ఎన్నికకు వెళ్లే ఇంట్రస్ట్ ఉందా? లేదా? అన్నది తెలియడం లేదు. కానీ వైసీపీ హైకమాండ్ ను ఇరుకున పెట్టాలని ఆమె డిసైడ్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి రాజీనామా విషయంలో ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశమైతే మాత్రం కనిపిస్తోంది.