https://oktelugu.com/

Modi`s History : మోదీలు అంటే ఎవరు? వాళ్ళు నిజంగా మోసగాళ్ళేనా?

Modi`s History : నరేంద్రమోదీ, నీరవ్‌ మోదీ, లలీత్‌ మోదీ.. ఇప్పుడు ఈ పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈపేర్లు పెట్టుకున్న ఆషామాషీ వ్యక్తులు కాదు. వీరిలో ఒకరు దేశ ప్రధాని కాగా, మిగతా వారు వివిధ ఆరోపణల మీద దేశం దాటి అత్యంత అవమానకరమైన జీవితాన్ని గడుపుతున్న వారు. ఇక వీరి పేరు వెనుక ఉన్న మోదీ అనే పదం గురించి వయనాడ్‌ ఎంపీ, ఏఐసీసీ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా […]

Written By: , Updated On : March 24, 2023 / 10:28 PM IST
Follow us on

Modi`s History : నరేంద్రమోదీ, నీరవ్‌ మోదీ, లలీత్‌ మోదీ.. ఇప్పుడు ఈ పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈపేర్లు పెట్టుకున్న ఆషామాషీ వ్యక్తులు కాదు. వీరిలో ఒకరు దేశ ప్రధాని కాగా, మిగతా వారు వివిధ ఆరోపణల మీద దేశం దాటి అత్యంత అవమానకరమైన జీవితాన్ని గడుపుతున్న వారు. ఇక వీరి పేరు వెనుక ఉన్న మోదీ అనే పదం గురించి వయనాడ్‌ ఎంపీ, ఏఐసీసీ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

మాటలు రేపిన మంటలు

‘దొంగలందరికీ ఇంటి పేరు మోదీ అనే ఉంటుంది ఎందుకో?’.. 2019లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేశాయి! ప్రధాని నరేంద్ర మోదీ, కేసుల్లో ఇరుక్కొని విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ పేర్లను ప్రస్తావిస్తూ రాహుల్‌ ఆ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గుజరాత్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ ఫిర్యాదు మేరకు రాహుల్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో అసలు ‘మోదీ’లు అంటే ఎవరు? వారికా పేరెలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయాలను పరిశీలిస్తే..

సంచార తెగకు చెందింది

మోదీ సామాజికవర్గం సంచార తెగకు చెందింది. ప్రధానంగా నూనె తయారీ వ్యాపారం చేసే ఈ తెగ ప్రజలు ఉత్తర భారతదేశం నుంచి 15 లేదా 16వ శతాబ్దంలో గుజరాత్‌కు వచ్చి స్థిరపడ్డారు. మోదీ ఇంటి పేరు కలిగిన వారు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. వీరిని 1994లో ఓబీసీ జాబితాలో చేర్చారు. సంచార వ్యాపార సామాజికవర్గం వారైన ‘మోదీ’లు గుజరాత్‌ వ్యాప్తంగా విస్తరించారు.. తొలినాళ్లలో వీరి ప్రధాన వృత్తి వేరుశనగ గింజలు, నువ్వుల నుంచి నూనె తీసి విక్రయించడం. ఈ వ్యాపారం ద్వారా వారు దేశవ్యాప్తంగా పేరు పొందారు.

మోధ్‌ వాణిక్‌ లేదా వాణియా

‘తేలీ ఘాంచీ (నూనె తీసేవాళ్లు)’గా పిలిచే ఈ సామాజిక వర్గాన్ని గుజరాత్‌లో ‘మోధ్‌ వాణిక్‌’ లేదా ‘వాణియా(బనియా)’ కులంగా వర్గీకరించారు. ఆది నుంచీ మోదీలను వ్యాపార సామాజికవర్గంగానే చూసేవారు. వారు ఎన్నడూ కులానికి సంబంధించిన ఆంక్షలు ఎదుర్కోలేదని తెలుస్తోంది. అగ్రవర్ణాల వారు కూడా వారిపట్ల ఎలాంటి వివక్షా చూపలేదని సమాచారం. ఆ తర్వాత క్రమంగా మోదీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఇక మోదీ సామాజికవర్గంలో రెండు ఉప కులాలు ఉన్నాయి. ఒకటి బనియా వ్యాపారవర్గం కాగా మరొకటి తేలీ ఘాంచీ వర్గం అని తెలుస్తోంది. తేలీ ఘాంచీ వర్గం వారినే ఓబీసీల్లో చేర్చారు. బనియా మోదీలు చాలా వ్యాపారాల్లో ఉన్నారు. ప్రధానంగా ఇళ్లకు అవసరమైన వస్తువులు విక్రయిస్తారు. అయితే మోదీలకు స్థానిక రాజకీయాలను శాసించే స్థాయిలో ఆర్థిక బలం లేదు.