South India sentiment- BJP: దేశం భౌగోళికంగా విభజించబడింది. దేశ ఆవిర్భావం నుంచి ఉత్తరం, దక్షిణమంటూ పిలుస్తున్నాయి. అయితే హస్తినా రాజకీయాలను మాత్రం శాసిస్తున్నది ఉత్తర భారత దేశమే. ఉత్తరాధితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు కీలక పదవులు అందని ద్రాక్షగా మిగులుతున్నాయి. వచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇలా ఏ పదవులు చూసుకున్న కనిపిస్తున్నది ఉత్తరాధి వారే. దీంతో ప్రజల్లో కూడా ఓ రకమైన సెంటిమెంట్ నడుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలను తొక్కిపెడుతున్నారన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవిని అయినా దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించి సముచిత స్థానం కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార బీజేపీ, విపక్షాలు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే రాష్ట్ర పతి అభ్యర్థి ఎవరన్నద మోదీ, షా ఎప్పుడో తేల్చుకుని ఉంటారు. వారు ఓ అభ్యర్థిని ఫిక్స్ చేసుకుని ఉంటారు. కానీ టైం చూసి బయట పెడతారు. ఆ అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ రాలేదు. కానీ దక్షిణాదిలో మాత్రం ఓ రకమైన సెంటిమెంట్ పెరుగుతోంది. దేశ రాజకీయ పాలనా వ్యవస్థలో దక్షిణాది ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతోందని కీలకమైన పదవులు కాదు కదా… కేంద్ర కేబినెట్ పదవులు కూడా దక్కడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో పెరుగుతోంది. కొద్ది రోజులుగా ఈ అంశంపై మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి.
దేశంలో దక్షిణాదిలో ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ ఉంది. ఇక్కడి నాయకులు దేశ రాజకీయాలను శాసించిన సందర్భాలున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. జాతీయ పార్టీల పాత్ర అంతంతమాత్రం. అక్కడక్కడ మాత్రమే బలంగా ఉన్నాయి. ఈ కారణంగా అధికారం ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది. అయితే ఉత్తరాదిలో మాత్రం జాతీయ పార్టీలు ప్రభావం చూపిస్తున్నాయి. అక్కడి గెలుపుతోనే దేశ పగ్గాలు చేపడుతున్నారు.
Also Read: Presidential elections 2022: విపక్షాలకు చిక్కని రాష్ట్రపతి అభ్యర్థి.. ఫలవంతం కాని తొలి భేటీ
అదే కారణంతో అక్కడి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాదిని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో దక్షిణాది పేరు కూడా వినిపించడం తగ్గిపోయింది. అయితే ప్రజల్లోకి బలంగా వెళుతోంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మాత్రం భిన్న రీతిలో ముందుకు సాగుతున్నాయి. జాతీయ పార్టీలకు ఉప పార్టీలుగా తయారయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాపకానికి కొన్ని పార్టీలు తెగ ఆరాటపడుతున్నాయి. సంఖ్యాబలంగా ఉత్తరాధి రాష్ట్రాలకు దీటుగా ఉన్నా.. జాతీయ పార్టీలకు మద్దతు తెలుపుతూ తమకు వచ్చిన అరుదైన అవకాశాలను చేజేతులా పోగొట్టుకుంటున్నాయి.
రాష్ట్రపతి అభ్యర్థికి గత మూడు పర్యాయాలుగా దక్షిణాది నుంచి ఎంపిక కాలేదు. ప్రధాని పదవి ఎలాగూ దక్కే పరిస్థితి లేదు. అందుకే.. రాష్ట్రపతి లాంటి కీలక పదవి అయినా దక్షిణాదికి ప్రాతినిధ్యం ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. లేకపోతే అసమానతలు పెరిగిపోతాయని ఇది అంతిమంగా దేశానికి నష్టం చేస్తున్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో మోదీ, షాలు ఏం ఆలోచిస్తున్నారో కానీ దక్షిణాది సెంటిమెంట్ మాత్రం పెరుగుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు. ఆయన ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు చాలామంది సీనియర్లు, గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధ పదవులు చేపట్టిన వారు ఉన్నారు. వారికి రాష్ట్రపతిగా అవకాశమివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరి ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి షా ద్వయం ఏం ఆలోచిస్తుందో చూడాలి మరీ.