Chandra Babu Naidu: తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు కీలకం. ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీకి ఇది క్లిష్ట సమయం. బలీయమైన అధికార పక్షానికి దీటుగా ఎదుర్కోవడానికి ఆ పార్టీకున్న బలం చాలదు. అందుకే ఒకవైపు పొత్తుల ప్రణాళికలతో చంద్రబాబు తలమునకలై ఉన్నారు. మరోవైపు ఈ రెండేళ్లు ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా తాను బస్సు యాత్ర చేపట్టడంతో పాటు కుమారుడు లోకేష్ పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేలో జరిగే మహానాడు ద్వారా సమరశంఖారావం పూరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్రతో లోకేష్ ను ఫోకస్ చేయడంతో పాటు రాజకీయంగా మైలేజ్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఉంది. కానీ దానిని టీడీపీ క్యాష్ చేసుకోలేకపోతోంది.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగానే పోరాడుతున్నారు. ప్రజల్లో కూడా పవన్ గ్రాఫ్ క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా మరింత దూకుడుగా ముందుకెళ్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. తన తలకు పదును పెడుతున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ తో మహానాడు జరగలేదు. కేవలం ఆన్ లైన్ కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అటు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ, రూట్ మ్యాప్ సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి పార్టీ పూర్వవైభవానికి చంద్రబాబు తహతహలాడుతున్నారు.
Also Read: Kamareddy Suicide Case: తెలంగాణలో అసహాయుల మరణాలు.. స్పందించని కేసీఆర్ సర్కార్
లోకేష్ తో పాదయాత్ర చేయించాలని పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడిని ద్రుష్ట్యా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. లోకేష్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి వివాదాలు, ఆయనను కేంద్రంగా చేస్తూ విపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలంటే పాదయాత్రే సరైన వేదిక అని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించారట. అయితే కుమారుడు సామర్థ్యం తెలిసిన చంద్రబాబు కొంత తటపటాయించారని తెలుస్తోంది. పాదయాత్ర ఎంత కష్టమో.. చంద్రబాబుకు తెలియంది కాదూ. అటు కాలినడకతో పాటు పదునైన మాటలతో ప్రసంగాలు సాగాలి.
కానీ లోకేష్ ఈ విషయంలో చాలా వీక్ అని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోకేష్ కు మానసికంగా పాదయాత్రకు సిద్ధం చేస్తున్నారు. గతంలో కంటే లోకేష్ కొన్ని విషయాల్లో పరిణితి చూపుతున్నారు. కానీ బాషాపరంగా ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అందుకే ఆ బాధ్యతను కొందరు నిపుణులకు అప్పగించారన్న టాక్ పార్టీలో నడుస్తోంది. వీలైనంత త్వరగా లోకేష్ ను ఫోకస్ చేయడం ద్వారా పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లోకేష్ పాదయాత్ర కంటే ముందే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలన్న యోచనలో ఉన్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో ప్రధాన ప్రాంతాలు, దాదాపు 100 నియోజకవర్గాలను కలుపుతూ బస్సు యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. మహానాడు వేదికపై బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్రపై స్పష్టమైన ప్రకటన చేసే వీలుంది.
Also Read: YS Vijayamma: తల్లిని సాగనంపిన జగన్.. పొమ్మనలేక పొగబెట్టారా?
Recommended Videos: