
సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూసూద్ చేసిన.. చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానంటూ వాలిపోతున్నారు. సోనూసూద్ ఇప్పుడు సాయానికి మారుపేరులా మారిపోయాడు. ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సాయాలు చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా.. ఓ విలేజీలో ఏకంగా సెల్ టవర్ వేయించాడు.
ఇప్పటికే పేద విద్యార్థుల చదువులకు అవసరమైన సాయం చేస్తానంటూ ముందుకు రాగా.. హర్యానాలోని మొర్ని గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఆన్లైన్ క్లాసెస్ కోసం మొబైల్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఆ గ్రామంలో మొబైల్ నెట్వర్క్ లేనందున ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కి క్లాసెస్ వింటున్నాడు. చెట్టు ఎక్కితే గాని నెట్వర్క్ రాని పరిస్థితి. దీంతో చలించిపోయిన సోనూ సూద్ వారి గ్రామంలో ఎయిర్ టెల్కు చెందిన టవర్‌ను ఏర్పాటు చేయించాడు.
తాను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని ఆ అబ్బాయి ట్విట్టర్ ద్వారా సోనుసూద్‌కు తెలియజేశాడు. విషయం తెలుసుకున్న సోనూ ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఎయిర్ టెల్ టవర్‌ను అక్కడ స్థాపించాడు. ఇప్పుడు ఆ గ్రామంలో నెట్వర్క్ సమస్య లేకుండాపోయింది. స్టూడెంట్స్ కోసం సోను చేసిన ఈ పనికి ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ పని చేసిన సోనూ సూద్‌ను అందరూ రియల్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అవును మరి.. సోనుసూద్ రియల్ హీరో అనే చెప్పాలి. కరోనా టైంలో వలస కార్మికులు స్వస్థలాలకు చేరేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరం చూశాం. వారి పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందించాయో అందరికీ తెలిసిందే. ఒక్క హీరో సోను ముందుకొచ్చి వారి కోసం బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా.. ఎన్నో విధాలా సాయం అందించి గమ్యస్థానాలకు చేర్చారు. ఒక రైతుకు ఎడ్లు కొనుక్కునే స్థోమత లేక భార్యాపిల్లలను ఎద్దుల్లా ఉపయోగించి దుక్కి దున్నించారు. దీంతో చలించిపోయిన ఆ రైతు కుటుంబానికి వెంటనే ట్రాక్టర్ కొని పంపించారు. ప్రవాసీ రోజ్‌గార్ వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపించాడు. ఇలా ఒకటా రెండా.. ఎన్నన్ని చెప్పేది సోను సాయాలు. అందుకే ఆయనను రియల్ హీరో అనడంలో తప్పులేదు.