Sonu sood : కరోనా మహమ్మారి దేశంపై భీకరమైన దాడిని కొనసాగిస్తున్న వేళ.. వందలు, వేల కోట్ల అధిపతులుగా ఉన్నవారు రూపాయి కూడా దానం చేయడానికి చేతులు రానివేళ.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేసిన సేవలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. అయితే.. తాజాగా ఆయనపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం సంచలనం రేకెత్తించింది. మూడు రోజులపాటు కొనసాగిన తనిఖీల్లో దాదాపు 20 కోట్ల రూపాయలకుపైగా పన్ను ఎగవేసినట్టు ఐటీ అధికారులు ప్రకటించారు. అయితే.. ఆయనపై దాడులు చేసిన సమయం, సందర్భం నేపథ్యంలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోనూ సూద్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు తెలిపారు. దీని కింద క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్టు వెల్లడించారు. సోనూ సూద్ తోపాటు ఆయన సహచరుల కార్యాలయాల్లోనూ పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు గుర్తించినట్టు తెలిపారు. సోనూ సూద్ ఏర్పాటు చేసిన ఛారిటీ సంస్థ 18 కోట్లకు పైగా విరాళాలు సేకరించించిందని ఐటీ అధికారులు తెలిపారు. అయితే.. అందులో కేవలం 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగిలిన డబ్బు మొత్తం ఆ సంస్థ ఖాతాలోనే ఉందని తెలిపారు.
దేశంలోని దాదాపు 28 చోట్ల తనికీలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆదాయ పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు తన ఆదాయాన్ని బోగస్ రునాల రూపంలో చూపించారని, బోగస్ ఎంటీటీలు చేశారని అధికారులు తెలిపారు. పన్ను ఎగవేతకు సంబంధించి నేరపూరిత సాక్ష్యాలు కూడా కనుగొన్నట్టు అధికారులు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఈ ఐటీ దాడులపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి తొలి దశలో మొదలైన సోనూ సేవలు.. సెకండ్ వేవ్ లో తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అడిగిన వారికి లేదనకుండా.. కాదనకుండా.. తనవల్ల అయినంత సేవ చేశాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. అలాంటి వ్యక్తిపై ఐటీ దాడులు చేయించడం.. పూర్తిగా రాజకీయకక్షగా ఆరోపిస్తున్నారు నెటిజన్లు.
ఇటీవల.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సోనూ సూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే కార్యక్రమానికి సోనూ ప్రచారకర్తగా సీఎం కేజ్రీవాల్ నియమించారు. ఇలాంటి సమయంలో సోనూపై ఐటీ దాడులు చేయిచండం పట్ల ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా.. రాజకీయ కక్షసాధింపేనని ఆరోపిస్తున్నాయి. అయితే.. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.