https://oktelugu.com/

Komatireddy Venkat Reddy: ఆలూ లేదు చూలూ లేదు.. అప్పుడే కోమటిరెడ్డి సీఎం అంట?

ముందుగానే మనం చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వాక్ స్వాతంత్రం చాలా చాలా అధికం. ఆ నాయకులు తమ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 15, 2023 / 01:32 PM IST

    Komatireddy Venkat Reddy

    Follow us on

    Komatireddy Venkat Reddy: మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు భిన్నమంటే.. అందులో మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. నాయకులకు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించే అధికారం మెండుగా ఉంటుంది.. అందువల్లే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా మొహమాటం లేకుండా తమ భావాలను వ్యక్తీకరిస్తారు.. ఏ విషయం పైనయినా ఓపెన్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి పరిణామాలు మిగతా పార్టీల్లో చోటు చేసుకుంటే పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది కాబట్టి చాలావరకు కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాల మీద విమర్శల కంటే అధికారంలోకి వస్తే తమ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందో ముందే చెబుతున్నారు.. రాజకీయ విశ్లేషకులు, మీడియా దీనిని ఆక్షేపిస్తున్నప్పటికీ వారు వెనకడుగు వేయడం లేదు.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి.

    నేనే ముఖ్యమంత్రిని

    ముందుగానే మనం చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వాక్ స్వాతంత్రం చాలా చాలా అధికం. ఆ నాయకులు తమ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తను ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. అంతేకాదు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలుస్తారని జోష్యం చెప్పారు.. కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ నిర్ణయం మేరకే ముఖ్యమంత్రి ఖరారు ఉంటుందని విలేకరులు ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలివిగా దాటవేశారు.

    అందరూ సీఎం అభ్యర్థులేనా?

    సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఒకరే అవుతారు. కానీ యాదృచ్ఛికంగా కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులమని ప్రకటించేసుకుంటున్నారు. ఇటీవల మదిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జలగం వెంగళరావు తర్వాత మీ బిడ్డకు ఆస్థానం దక్కబోతోందని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ వ్యాఖ్యల ద్వారా తాను త్వరలో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని అని ప్రకటించేసుకున్నారు. ఇది మర్చిపోకముందే సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రానికి నేనే కాబోయే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. ఈయన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల జాబితా రెండుకు చేరింది. ఆ తర్వాత కొడంగల్ లో నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తానే తెలంగాణకు కాబోయే సీఎం ను అని కుండబద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు.. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులకు అంతు పొంతు ఉండదు. ఇక ఈ నేతల వ్యాఖ్యలను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా అధికారంలోకి రాలేదు.. అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థులం మేమంటే మేమంటూ కాంగ్రెస్ నాయకులు తెగ హడావిడి చేస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. మరి ఈ చర్చ ముగిసి పోవాలంటే డిసెంబర్ మూడు దాకా ఎదురు చూడాల్సిందే.