
కేంద్రం విధించిన లాక్డౌన్ 3.0 ఈనెల 17తో ముగియనుంది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ముఖ్యమంత్రులు లాక్డౌన్ కొనసాగింపు, ఎత్తివేతలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ముఖ్యమంత్రులు లాక్డౌన్ కొనసాగించాలని కోరగా.. మరికొందరు ఎత్తివేయాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రం వలస కార్మికుల కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేయడంపై ప్రధాని మోదీని ప్రశంసించారు. అయితే కిందిస్థాయిలో మాత్రం వలస కార్మికుల తరలింపు క్రెడిటంతా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో పెద్దఎత్తున వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. గత 50రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండగా నేటి నుంచి కేంద్రం వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. కేంద్రం తొలుత రైల్వే ఛార్జీలను వలస కార్మికులు భరించాలని సూచించింది. లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక అల్లాడుతున్న కార్మికుల నుంచి రైల్వే ఛార్జీలు వసూలు చేస్తామనడంపై రాజకీయంగా దుమారం చెలరేగింది. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేంద్రం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వలస కార్మికుల ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని.. ఇప్పటికే రైల్వేశాఖకు డబ్బులు కూడా చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వలస కార్మికుల రైల్వే ఛార్జీలు తానే భరిస్తానంటూ హామీ ఇచ్చారు.
వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తామనడంపై అన్నివర్గాల నుంచి నిరసన రావడంతో కేంద్రం అలర్ట్ అయింది. దీంతో కేంద్రం 85శాతం భరిస్తామని మిగతా 15శాతం ఆయా రాష్ట్రాలు భరించాలని కోరింది. దీనికి రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేయడంతో వలస కూలీలను కేంద్రం ఉచితంగా రైళ్లలో ఆయా రాష్ట్రాలకు తరలిస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు వలస కార్మికుల ప్రయాణిస్తున్న రైళ్లలో మీ రైలు చార్జీలను సోనియమ్మ చెల్లించారంటూ కరపత్రాలను పంచిపెట్టడం గమనార్హం. వలస కార్మికులకు తరలించేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపట్టి, ఛార్జీలు సైతం చెల్లిస్తున్నప్పటికీ క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ ఖాతాలో వెళ్లిపోవడం గమనార్హం.