
తిరుపతి పార్లమెంట్ ఎన్నికపై బీజేపీ ఫోకస్ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు రంగంలోకి దిగారు. ప్రధానంగా అధికార వైసీపీని టార్గెట్ చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న లోపాయికారి విధానాలను వీర్రాజు ఎత్తి చూపారు.
తిరుపతి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.310 కోట్లు ప్రజాధనాన్ని వృథా చేస్తోందని ఆరోపించారు.నవరత్నాల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందని సోము వీర్రాజు ఆరోపించారు.
పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురిచేశారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తూ ఎన్నికల్లో గెలుపునకు వారిని వాడుకుంటోందని ఆరోపించారు
ఈ క్రమంలోనే ఏపీలోని వ్యవస్థలను వాడుకుంటూ గెలుస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు.తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తామని.. ప్రచారం, పర్యవేక్షణ కోసం రెండంచెల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇక తిరుపతిలో ప్రచార నియోజకవర్గాల బాధ్యుల కమిటీని సోము వీర్రాజు ఏర్పాటు చేశారు.వీటికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి నేతృత్వం వహిస్తానని ఆయన ప్రకటించారు.