Vishnukumar Raju : బీజేపీలో కొనసాగుతున్న అసంతృప్త నేతల్లో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒకరు. టీడీపీతో బీజేపీ కలవాలన్న కోరిక ఉన్న నేతల్లో ముందంజలో ఉంటారు. బీజేపీలో ఉన్నా టీడీపీ అనుకూల వాయిస్ వినిపిస్తుంటారు. వైసీపీ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అయితే టీడీపీతో కలిసి నడిచేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొగ్గుచూపకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. టీడీపీతో కలిసి నడిస్తేనే బీజేపీకి ఓట్లు, సీట్లు పెరుగుతాయని చెబుతూ వస్తుంటారు. ఈ క్రమంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిని బేస్ చేసుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనపై వేటువేసేందుకు సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఆ ప్రోమోతో..
విష్ణుకుమార్ రాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓపెన్ హార్ట్ పేరుతో ప్రసారమయ్యే ఈ ఇంటర్యూలో విష్ణుకుమార్ రాజు బీజేపీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాచేస్తే ఏపీలో ఒక్క సీటు కూడా రాదని మోదీకి చెప్పినట్టుగా విష్ణుకుమార్ రాజు అన్నట్టు ఓ ప్రోమో విడుదలైంది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇన్నాళ్లూ లోలోపల విష్ణుమాక్ రాజు ఎన్ని చేసుకున్నా పట్టించుకోని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దీనిని అవమానంగా ఫీలవుతున్నారు. బీజేపీ బలోపేతం కోసం ఇంత కష్టపడి పని చేస్తుంటే.. ఒక్క సీటు కూడా రాదంటావా అంటూ ఆయన విష్ణుకుమార్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సంజాయిషీ నోటిసు ఇచ్చినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల నాటిది…
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోమో ఇప్పటిది కాదని.. గత ఎన్నికలకు ముందు చేసినదని తెలుస్తోంది. కానీ వచ్చే ఎన్నికల గురించి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో దీన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు సీరియస్ గా తీసుకున్నారు. తాను నానా తంటాలు పడి పార్టీని నిలబెడుతుంటే.. ఒక్క మాటతో పార్టీని నష్టం చేకూర్చుతారా అంటూ సంజాయిషీ నోటిసులు పంపించారు. అయితే గత ఎన్నికల ముందు నాటిది కావడంతో..ఇప్పుడు రాజుగారు ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ.
వ్యూహాత్మకంగానే…
2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. ఆది నుంచి ఆయన టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా కాస్తా ప్రేమ ఎక్కువే. వచ్చే ఎన్నికల్లో సైతం బీజేపీ టీడీపీతో పొత్తు నడవాలని కోరుకుంటున్నారు.అలా అయితేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆయన భావన. కానీ రాష్ట్ర నాయకుల తీరు వేరేగా ఉండటంతో టీడీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొన్నటికి మొన్న కన్నా లక్ష్మీనారాయణతో పాటే టీడీపీలో చేరాల్సి ఉన్నా చివరి నిమిషంలో వెనుకడుగు వేశారు. చివరి నిమిషంలోనైనా పొత్తు కుదురుతుందని భావిస్తున్నారు. పొత్తు కోటాలో టిక్కెట్ దక్కించుకోవచ్చన్న చంద్రబాబు ఆదేశాలతోనే విష్ణుకుమార్ రాజు వెనక్కి తగ్గారన్న టాక్ ఉంది. అయితే అంతకంటే ముందే పార్టీ నుంచి బయటకు నెట్టాలన్న ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.