Somesh Kumar- CM KCR: అనుకున్నట్టుగానే కెసిఆర్ సోమేష్ కుమార్ కు అగ్ర తాంబూలం ఇచ్చాడు. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ₹లక్షల్లో జీతం ఇచ్చి కేబినెట్ హోదా కల్పించాడు. తనకున్న సలహాదారుల విభాగంలో మరొక మాజీ సీ ఎస్ ను నియమించుకున్నాడు. అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి, అనేవాడు ఎవడూ లేడు కాబట్టి అది కేసీఆర్ ఇష్టం. అసలు తెలంగాణ ఆర్థిక శాఖ చాలా క్రమశిక్షణతో పని చేస్తుందని అంటాడు కానీ.. శరత్ మర్కడ్ లాంటి వారి అడ్డగోలు నియామకాలతో ఎలాంటి సందేశం ఇస్తున్నాడో కేసీఆర్ కే తెలియాలి. ఇప్పుడు అనేక వివాదాలకు కారణమవుతున్న ధరణి, టీచర్ బదిలీలకు సంబంధించి తీసుకొచ్చిన జీవో..అన్ని కూడా ఈ సోమేశ్ కుమార్ పుణ్యమే. అయినప్పటికీ సోమేశ్ కుమార్ ని కెసిఆర్ నమ్ముతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కెసిఆర్ ఫోల్డ్ లోకి వెళ్తాడు అనుకున్నారు
హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపోర్టు చేశాడు.ఆ తర్వాత చాలామంది అనుకున్నట్టుగానే తన పదవికి రాజీనామా చేశాడు. తనకు అత్యంత ఇష్టమైన కేసీఆర్ దగ్గరికి మళ్ళీ వచ్చాడు. అయితే ఈసారి సోమేష్ కుమార్ రెరా చైర్మన్ అవుతాడని ప్రచారం జరిగింది. అంతేకాదు భారత రాష్ట్ర సమితిలోనూ చేరతాడు అని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. దానికి పరోక్షంగా సంకేతాలు ఇస్తూనే ఆయన మొన్న మహారాష్ట్రలో జరిగిన భారత రాష్ట్ర సమితి సమావేశంలో కేసీఆర్ వెంట అక్కడికి వెళ్ళాడు. కేసీఆర్ తో వేదిక పంచుకున్నాడు. అది జరిగిన కొద్ది రోజులకే సోమేశ్ కుమార్ కు సలహాదారు పోస్టు కట్టబెట్టాడు. కెసిఆర్ అపోస్తుకు క్యాబినెట్ ర్యాంక్ జమ చేశాడు. ఇప్పటికే గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ శర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ముఖ్య సలహాదారు పదవిలో ఉన్నారు. అయితే రాజీవ్ శర్మ పూర్తిగా పాలనాపరమైన వ్యవహారాలు చూస్తున్నారు.
ఉత్తరాది భారం
భారత రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత మహారాష్ట్రలో కెసిఆర్ కాలు పెట్టారు. ఇప్పటికే మూడుసార్లు ఆ రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించారు..భోకర్ మార్కెట్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులు బొక్కా బోర్లా పడ్డారు. డబ్బులు వెదజల్లినప్పటికీ ఉత్తరాది ప్రయోజనం నెరవేరదని భావించిన కెసిఆర్ సోమేష్ కుమార్ కు ఆ బాధ్యత అప్పగించారు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శి రాజకీయ పనులు చేయకూడదు. ఒకవేళ రాజకీయ పనులు చేస్తే సదర్ ముఖ్యమంత్రి తన వ్యక్తిగత డబ్బుల నుంచి జీతం చెల్లించాలి. ఇక్కడ తెలంగాణలో నడుస్తోంది కేసీఆర్ రాజ్యాంగం కాబట్టి ఆయన చెప్పినట్టే వ్యవస్థలు మొత్తం నడుచుకుంటాయి. చీఫ్ సెక్రటరీ కూడా ముఖ్యమంత్రి ఆదేశానుసారం పని చేయాలి కాబట్టి.. ఆయన చెప్పినట్టే జీవోలు ఇస్తున్నారు అని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ తో సన్నిహిత సంబంధాలు
సోమేశ్ కుమార్ కు తన సొంత రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో పలుమార్లు ప్రశాంత్ కిషోర్ ద్వారా సర్వేలు నిర్వహించి కెసిఆర్ కు అందజేశారు. ఆ సమయంలో సోమేశ్ కుమార్ పనితీరును నచ్చిన కేసీఆర్ తన పార్టీని ఉత్తరాది ప్రాంతంలో విస్తరించేందుకు సోమేశ్ కుమార్ సలహాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే సోమేశ్ కుమార్ కు సలహాదారు పదవి ఇవ్వాలా లేక భారత రాష్ట్ర సమితి బీహార్ ఇన్చార్జి పదవి ఇవ్వాలా అనే సంశయాలు ఒకానొక దశలో కేసీఆర్ ను చుట్టుముట్టాయి. అయితే చివరికి సలహాదారు పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకొని, ఆ పదవిని సోమేశ్ కుమార్ కు కట్టబెట్టారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరడం వెనుక సోమేశ్ కుమార్ చక్రం తిప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేసీఆర్ సభల నిర్వహణలో కూడా సోమేశ్ కుమార్ పాత్ర పరోక్షంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సోమేశ్ కుమార్ ఉత్తరాది రాష్ట్రాల బాధ్యతలు చూస్తారని, కెసిఆర్ ప్రణాళికలు అమలు చేస్తారని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. కేబినెట్ హోదా కల్పించడంతో సోమేశ్ కుమార్ కు అమితమైన ప్రాధాన్యం లభించినట్లు అయింది. అయితే కేసీఆర్ ఇప్పటివరకు హిందీ రాష్ట్రాల్లో భారత రాష్ట్ర సమితి ఉనికి కోసం చేసింది ఏమీ లేదు. కానీ అంతర్గతంగా వేస్తున్న ప్రణాళికలు ఎదురు తంతున్నాయి. ఇలాంటి క్రమంలో సోమేశ్ కుమార్ కు బాధ్యతలు అప్పగిస్తే ఉత్తరాది టాస్క్ ను సమర్థవంతంగా నిర్వహిస్తారని భారత రాష్ట్ర సమితి నాయకులు అభిప్రాయపడుతున్నారు.