భారత ‘స్వాతంత్య్రం’.. కొన్ని నిజాలు!

ఎర్రకోటపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత ప్రధాని నరేంద్రమోడీ సగర్వంగా ఈరోజు జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 73వ స్వాతంత్ర్య వేడుకలతో దేశం ఉప్పొంగిపోతోంది. అయితే ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చడం వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఉంది. 200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. అందుకే […]

Written By: NARESH, Updated On : August 15, 2020 11:02 am
Follow us on


ఎర్రకోటపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత ప్రధాని నరేంద్రమోడీ సగర్వంగా ఈరోజు జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 73వ స్వాతంత్ర్య వేడుకలతో దేశం ఉప్పొంగిపోతోంది. అయితే ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చడం వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఉంది. 200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. అందుకే పంద్రాగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయ రోజుగా నిలిచిపోయింది.

Also Read: తొలి కాంగ్రెసేతర ప్రధాని..రికార్డ్ సృష్టించిన మోడీ

భారత స్వాతంత్య్రోద్యమం గురించి చాలా మంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకొని ఉంటారు. అలాగే స్వాతంత్య్రోద్యమంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి. పుస్తకాలు, సినిమాలు, నాటకాల్లో ప్రస్తావించని ఎన్నో విషయాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 15, 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. అయితే అదే రోజున బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ఎందుకు ప్రకటించారు. జూన్ లోనే నిర్ణయించిన స్వాతంత్ర్యాన్ని ఆగస్టు వరకు ఎందుకు పొడిగించారు.? 15వ తేదికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అప్పటి భారత బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ కు ఆగస్టు 15తో ఏం సంబంధం ఉందనే చాలా ప్రశ్నలు భారతీయులకు ఎవరికీ తెలియవు. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి నుంచే మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజు భారత్‌తో పాటు కొరియా, కాంగో, బెహ్రయిన్, లీచెన్‌స్టీన్ దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్ర్యం ఎందుకిచ్చారన్నది తెలుసుకుందాం.

నిజానికి చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఫిబ్రవరి 1947లోనే భారత్ కు వచ్చారు. కానీ చాలా మంది భారతీయ నేతలతో ఆయన చర్చలు జరిపారు. అధికార మార్పిడి ప్రక్రియలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే అదంతా సులభంగా జరగలేదు.ఎన్నో చర్చల తర్వాత ఏకాభిప్రాయం కుదిరాకే భారత్ కు ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రకటించారు.

నిజానికి అప్పటికే గాంధీ పిలుపుతో దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరోవైపు సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీతో కలిసి భారత్ పై దండెత్తి వస్తున్నాడు. ఇక అప్పటికే బ్రిటన్ దేశం రెండో ప్రపంచ యుద్ధంతో ఆర్థికంగా బాగా చితికిపోయింది. బ్రిటన్ పాలన కానకష్టమైంది. 1945లో బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో ఆ దేశ నాయకులు అప్పటికే తాము ఎన్నికల్లో గెలిస్తే భారత్ కు స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆ ప్రక్రియను ప్రారంభించారు.

Also Read: హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…?

జపాన్ లొంగిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15వ తేదిని భారత స్వాతంత్ర్య దినంగా లార్డ్ మౌంట్ బాటన్ సూచించారు. సింగపూర్‌లో జపాన్ లొంగుబాటును అంగీకరించిన సౌత్-ఈస్ట్ ఆసియా కమాండ్‌కు మౌంట్‌బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్‌గా వ్యవహరించారు.ఆ తేది అంటే మౌంట్ బాటెన్ కు సెంటిమెంట్ గా మారింది. అందుకే ఆగస్టు 15న అర్ధరాత్రి దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు.

భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. రాష్ట్రంలో ముస్లింలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పాకిస్థాన్‌లోనే కలుస్తుందని ఆ దేశం నమ్మింది. కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. 1947 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌.. భారత్‌లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్, పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది.

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ ర్యాడ్‌క్లిఫ్ నిర్ణయించారు. ఈయన బ్రిటిష్ న్యాయ కోవిదుడు. భారత భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన లేకుండానే ర్యాడ్‌క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు. అదే ఇప్పుడు పాకిస్తాన్, భారత్ మధ్య 73 ఏళ్లుగా వైరానికి కారణమైంది. తన నిర్ణయంపై చనిపోయేంత వరకు ర్యాడ్‌క్లిఫ్ బాధపడుతుండేవారని చెబుతుంటారు.

-నరేశ్ ఎన్నం