https://oktelugu.com/

సోము వీర్రాజు ఎంపికలో సామాజిక కోణం

సోము వీర్రాజుని బిజెపి కొత్త అధ్యక్షుడిగా నియమించటం స్తబ్దుగా వున్న రాష్ట్ర రాజకీయాల్లో కదలిక వచ్చింది. రాజకీయ పార్టీల కతీతంగా ఈ నియామకాన్ని స్వాగతించటం జరిగింది. సాంఘిక మాధ్యమాల్లో కూడా దీనిపై పాజిటివ్ స్పందన రావటం విశేషం. కన్నా లక్ష్మీనారాయణ పై సాంఘిక మాధ్యమాల్లో వచ్చే సెటైర్లు బిజెపి పై కూడా ప్రభావం చూపాయి. అదే సోము వీర్రాజు విషయంలో అందుకు విరుద్ధంగా పాజిటివ్ వైబ్రేషన్లు వచ్చాయి. దీనికి తోడు బిజెపి క్యాడర్ లో పునరుత్తేజం కనబడింది. […]

Written By:
  • Ram
  • , Updated On : July 29, 2020 / 12:56 AM IST
    Follow us on

    సోము వీర్రాజుని బిజెపి కొత్త అధ్యక్షుడిగా నియమించటం స్తబ్దుగా వున్న రాష్ట్ర రాజకీయాల్లో కదలిక వచ్చింది. రాజకీయ పార్టీల కతీతంగా ఈ నియామకాన్ని స్వాగతించటం జరిగింది. సాంఘిక మాధ్యమాల్లో కూడా దీనిపై పాజిటివ్ స్పందన రావటం విశేషం. కన్నా లక్ష్మీనారాయణ పై సాంఘిక మాధ్యమాల్లో వచ్చే సెటైర్లు బిజెపి పై కూడా ప్రభావం చూపాయి. అదే సోము వీర్రాజు విషయంలో అందుకు విరుద్ధంగా పాజిటివ్ వైబ్రేషన్లు వచ్చాయి. దీనికి తోడు బిజెపి క్యాడర్ లో పునరుత్తేజం కనబడింది. వై ఎస్ ఆర్ పి జెండాలు కట్టిన వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడ్ని చేయటంతో అవాక్కైన క్యాడర్ కక్కలేక మింగలేక ఇన్నాళ్ళు మిన్నకుండిపోయారు. ఇప్పుడు తిరిగి తమ మధ్య పెరిగిన వ్యక్తి అధ్యక్షుడు కావటంతో హుషారు గా  వున్నారు.

    నూతన అధ్యక్షుని ఎన్నికకు భూమిక

    బిజెపి ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జాతీయ పార్టీ. 2014 లో మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత పార్టీ కూడా కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడివేసిన గొంగళి అక్కడే వుంది. తెలంగాణాలో మాత్రం కొంత మెరుగ్గా వుంది. 2014 లో ఒక్క సీటే వస్తే 2019 వచ్చే సరికి నాలుగు సీట్లు గెలుచుకొని తన ఉనికిని కాపాడుకోగల్గింది. అదే ఆంధ్రలో నయితే దారుణమైన ఫలితాలు వచ్చాయి. సీట్లు రాకపోతే పోనీ గౌరవప్రదమైన ఓట్లు కూడా రాకపోయేటప్పటికి బిజెపి కేంద్ర నాయకత్వానికి తప్పెక్కడ జరిగిందో అర్ధమయ్యింది. అందుకే ఈసారి లేటయినా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది.

    కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కి అధ్యక్షస్థానం కట్టబెట్టటం వరకూ వాళ్ళ వ్యూహం సరయినదైనా కన్నా లక్ష్మీనారాయణ ని ఎన్నిక చేయటం వ్యూహం బెడిసి కొట్టటానికి కారణమనే నిర్ధారణకు వచ్చారు. దీనితోపాటు చంద్రబాబు నాయుడు మోడీపై తీవ్రంగా విరుచుకు పడటం, దానికి అనుగుణంగానే మీడియా మొత్తం మోడీ వ్యతిరేక ప్రచారం చేయటం కూడా వాళ్ళ దృష్టి లో వుంది. అదేసమయం లో కొత్త అధ్యక్షుడు ఎన్నిక విషయం లో కూడా లోతుగా చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రం లో రెండు ప్రధాన పార్టీలు రెండు అగ్రకులాల ఆధిపత్యం లో ఉండటంతో రాష్ట్రంలోని అతిపెద్ద సామాజిక వర్గం కాపులను ఎటువంటి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ సామాజిక వర్గం లో కూడా కొత్తగా వచ్చినవాళ్ళతో ప్రయోగం విఫలం కావటం తో మొదట్నుంచీ ప్రాధాన్యత వున్న వాళ్ళకే ఇవ్వాలని అనుకోవటంతో సోము వీర్రాజు కి లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఎంపిక తో కాపు సామాజిక వర్గంలో కదలిక వచ్చింది. దానికి కారణం లేకపోలేదు.

    కాపు సామాజిక వర్గం లో నూతనోత్సాహం 

    కాపులు రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇంకొకరి మోచేతికింద నీళ్ళు తాగాల్సి వస్తుందని ఆ వర్గపు జనంలో అసంతృప్తి  నెలకొంది.  దాని పర్యవసానమే ప్రజా రాజ్యం అవతరణ. కానీ ఆ ఉత్సాహం మొదట్లోనే ఆవిరై పోయింది. ఒక్క ఎన్నికకే ఆ ప్రయోగం చతికిల పడటం ఆ సామాజిక వర్గం లో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ఆ షాక్ నుంచి కోలుకోవటానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ముద్రగడ ఉద్యమం లో కాపులు ర్యాలి అయ్యారు. అయితే అది కేవలం ఒక సమస్యపై నే  కేంద్రీకరికరించ బడటం , చంద్రబాబు నాయుడు నిర్దాక్షిణ్యంగా అణచటం తో అది అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. కానీ కాపు సామాజిక వర్గం లో మాత్రం అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పోటీ చేయటం తో తిరిగి కొంత కదలిక వచ్చింది. అయితే ఇది మొదట్లో కొంత వూపు వచ్చినా ఎన్నిక తేదీ దగ్గర పడే కొద్దీ తేలిపోయింది. మొదట్లో అధికారం లో వున్న చంద్రబాబు నాయుడు, ఆయన పుత్ర రత్నం  లోకేష్ పై ఎక్కుపెట్టిన విమర్శ సడెన్ గా అధికారం లో లేని జగన్ పైకి మల్లటం, అప్పటికే జనసేన తెలుగుదేశం బి టీం అని వై ఎస్ ఆర్ సి పి ప్రచారం చేయటం తో కాపు సామాజిక వర్గం అయోమయానికి లోనయ్యింది. ఆ వర్గపు ఓట్లు చీలి వై ఎస్ ఆర్ సి పి కి లాభం చేకూరటం జరిగింది. మొత్తం మీద ప్రజారాజ్యం తో మొదలయిన కాపు సామాజిక సమీకరణ అనేక ఆటుపోట్లతో పడి లేస్తూ సాగుతూవుంది. ఇంతవరకు విజయవంతం కాకపోయినా సామాజిక సమీకరణ మాత్రం ఎక్కువ తక్కువలతో సాగుతూనే వుంది. ఈ నేపధ్యం లో బిజెపి కి రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నిక కావటంతో ఈ వర్గం లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. కాపు సామాజిక సమీకరణ మొదలైన దగ్గర్నుంచీ ఇంతవరకు పాజిటివ్ ఫలితం రాకపోయినా ఏ కొంచెం వూతం దొరికినా ర్యాలీ కావటం జరుగుతుంది. ఈ కోణంలో సోము వీర్రాజు ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించటం తో ఈ సామాజిక వర్గం ఉత్సాహంగా వుంది. అయితే ఇంతకుముందు అనుభవాలు చూసినప్పుడు ఈ ఉత్సాహం కూడా నీరుకారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. లేకపోతే ఎప్పటిలాగే నిరాశలోకి జారిపోవాల్సి వస్తుంది. అలాజరగాకుండా ఉండాలంటే ఏమి చేయాలో తరువాయి భాగం లో చర్చించుకుందాం.

    (సశేషం)