https://oktelugu.com/

సామాజిక, మతపరమైన విద్యా అసమానతలు

నిన్న రాష్ట్రాలవారిగా విద్యా అసమానతల గురించి చర్చించుకున్నాము. అలాగే సామాజిక , మతపరమైన అసమానతలు కూడా దేశ వ్యాప్త సర్వేలో బయటపడ్డాయి. ఈ రెండింటిలోనూ కామన్ గా వున్న ఒకే అంశం, లింగ అసమానత. అది ఎస్ సి , ఎస్టి అయినా హిందూ , ముస్లిం అయినా కొట్టేచ్చేటట్లు కనబడేది పురుషులకు, మహిళలకు వున్న అంతరం. అది అక్షరాస్యత లోనైనా, స్కూలు విద్యలో నైనా,  వున్నత విద్యలో నైనా, కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులో నైనా, స్కూలుకు […]

Written By:
  • Ram
  • , Updated On : September 9, 2020 / 08:44 PM IST
    Follow us on

    నిన్న రాష్ట్రాలవారిగా విద్యా అసమానతల గురించి చర్చించుకున్నాము. అలాగే సామాజిక , మతపరమైన అసమానతలు కూడా దేశ వ్యాప్త సర్వేలో బయటపడ్డాయి. ఈ రెండింటిలోనూ కామన్ గా వున్న ఒకే అంశం, లింగ అసమానత. అది ఎస్ సి , ఎస్టి అయినా హిందూ , ముస్లిం అయినా కొట్టేచ్చేటట్లు కనబడేది పురుషులకు, మహిళలకు వున్న అంతరం. అది అక్షరాస్యత లోనైనా, స్కూలు విద్యలో నైనా,  వున్నత విద్యలో నైనా, కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులో నైనా, స్కూలుకు హాజరయ్యే విషయం లో నైనా ఈ అంతరం స్పష్టంగా కనబడుతుంది. ఇది సమాజ పురోగతి ఏ స్థాయిలో వుందనేదానికి చిహ్నం. దీనితోపాటు పట్టణ, గ్రామీణ అంతరం కూడా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇది సహజం. ఈ అంతరం ఎప్పటికీ వుంటుంది. కానీ స్త్రీ, పురుష అంతరం మాత్రం మన సమాజ పురోగతి పై మారుతుంది. దానికి సమాజం లోని చారిత్రిక సామాజిక సమస్యలుప్రధాన కారణం. చట్టాల్లో సమాన హక్కులు, సామాజిక చైతన్యం కల్పించగలిగితే ఈ అంతరాన్ని సాధ్యమైన మేర తగ్గించుకోగలం. ఇక ఆ వివరాలలోకి వెళదాం.

    అక్షరాస్యతలో సామాజిక, మత అసమానతలు 

    సామాజిక పరంగా ఇప్పటికీ ఎస్టీ లు అందరికన్నా అక్షరాస్యతలో వెనకబడి వున్నారు. ఆ తర్వాత వరసగా ఎస్సీ లు, వెనకబడిన వర్గాలు వస్తారు. రిజర్వుడు కాని వర్గాలకి , రిజర్వుడు వర్గాలకి ఇప్పటికీ అక్షరాస్యతలో అంతరం కొనసాగుతూనే వుంది. పురుషులలో చూసుకుంటే రిజర్వుడు కాని వర్గాల్లో 90 శాతం కి పైగా అక్షరాస్యులు వుంటే ఎస్టీ ల్లో 77.5 శాతం, ఎస్సీ ల్లో 80.3 శాతం, ఓబిసి లలో 84.4 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు వున్నారు. అదే స్త్రీలలో ఇంకా చాలా దిగువనే ఈ గణాంకాలు వున్నాయి. వీటినిబట్టి రిజర్వేషన్ల అవసరం ఇంకా సమాజం లో వుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ గణాంకాలు వున్నత విద్యల్లో మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, వున్నత విద్యకు హాజరయ్యే వారి శాతం రిజర్వుడు కాని వారిలో 30 శాతం వుంటే ఎస్టీ ల్లో కేవలం 14 శాతం మాత్రమే వుంది. అదే ఎస్సీ ల్లో నయితే 18 శాతం, ఓబిసి ల్లో23 శాతం వుంది. ఈ అంతరం ప్రాధమిక విద్య నుంచి హై స్కూలుకి హాజరయ్యే వాళ్ళలో చాలా తక్కువ వుంది. అంటే క్రమేపీ సామాజిక అంతరాలు పాజిటివ్ దిశలో ప్రయాణం చేస్తున్నాయని అర్ధమవుతుంది. ఇదే ధోరణి కొనసాగితే ఇంకో దశాబ్దం లో సామాజిక అంతరాలకు ఫులు స్టాప్ పెట్టొచ్చనిపిస్తుంది. మనిషి ఆశావాది కదా. పాజిటివ్ గానే ఆలోచిద్దాం.

    ఇకపోతే మతపరంగా అసమానతలు కొనసాగుతూనే వున్నాయి. కాకపోతే అక్షరాస్యతలో సామాజికపరంగా వున్నన్ని అంతరాలు పురుషుల అక్షరాస్యత లో లేవు. క్రైస్తవుల్లో 88 శాతం వుంటే ముస్లింలలో 81 శాతం అక్షరాస్యులు వున్నారు. అదే హిందూ పురుషుల్లో 85 శాతం వున్నారు. కాకపోతే ఇది స్త్రీలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్రైస్తవ స్త్రీలలో 82 శాతం అక్షరాస్యులు వుంటే ముస్లిం స్త్రీ లలో కేవలం 69 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు వున్నారు. హిందూ స్త్రీలలో కూడా కేవలం 70 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు వున్నారు. అంటే అర్ధం హిందూ, ముస్లిం సమాజాలు పురుషాధిక్య సమాజాల్లో కొనసాగుతున్నాయని అర్ధమవుతుంది. దీనికి ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా ఆస్తిలో స్త్రీ, పురుషులకు సమానవాటా ఇవ్వటం అవసరం. హిందూ చట్టాల్లో ఇటీవలికాలం లో కొన్ని మార్పులు చేసినా అవి వాస్తవానికి అమలుకి నోచుకోవటం లేదు. ఇస్లాం లోనయితే ఆ మార్పులు కూడా చేయలేదు. దీనితోపాటు అందరూ సమానులేననే చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతయినావుంది. లింగ వివక్ష అనేది మనం మాట్లాడే మాటల్లో, రోజువారీ పనుల్లో స్పష్టంగా సమాజం లో కనబడుతూనే వుంటుంది. ఇకపోతే స్కూళ్ళకు, ఉన్నతవిద్యకు హాజరయ్యే వాళ్ళలో చూస్తే ఇస్లాం సమాజం మిగతావారికంటే బాగా వెనకబడి వుంది. అటు పురుషుల్లోనూ ఇటు స్త్రీలలోనూ ఈ అంతరం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ముఖ్యంగా వున్నత విద్యలోనయితే ముస్లిం స్త్రీలు మిగతావారితో పోలిస్తే చాలా వెనకబడి వున్నారు. క్రైస్తవ స్త్రీలు 28 శాతం మంది వున్నత విద్యకు హాజరవుతుంటే హిందూ స్త్రీలు 24 శాతం, అదే ముస్లిం స్త్రీలు కేవలం 14 శాతం మంది మాత్రమే హాజరవుతున్నారు. ఇది ఆందోళన కల్గించే అంశం. టివిల్లో లెక్చర్లు దంచే ‘సెక్యులర్’ వాదులు ఎక్కువకాలం అధికారం లో వుండి కూడా ముస్లిం సమాజానికి చేసింది శూన్యం. కేవలం ఓట్లు దండుకోవటం తప్ప. వాళ్ళ పిల్లలు విద్యావంతులయితే అంతకన్నా ఆ సమాజానికి మేలు ఏముంటుంది? సచార్ కమిటీ నివేదిక తర్వాత కూడా ఆ దిశగా ప్రయత్నం చేయలేదని తెలుస్తుంది. భారతీయ సెక్యులరిజం లోని డొల్లతనం ఈ గణాంకాలతో తేటతెల్లమయ్యింది.

    కంప్యూటర్, ఇంటర్నెట్ వాడకం లోనూ మన రాష్ట్రాలు అధమమే 

    మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా మిగతా దేశాలకు కంప్యూటర్ కోర్సులు చేసి వలస వెళ్ళటం తెలిసిందే. అదిచూసి మనం మిగతా రాష్ట్రాల కన్నా ఈ విషయం లో ముందంజలో ఉన్నామని అనుకుంటున్నాము. కాని అది వాస్తవం కాదు. కొద్దిమంది మాత్రమే ఆ విధంగా వెలుతుండోచ్చు కానీ మొత్తం జనాభాలో కంప్యూటర్ వాడకం చూస్తే మిగతా రాష్ట్రాలకన్నా వెనకబడి ఉన్నాము. కంప్యూటర్ వాడకంలో దేశంలోని మొదటి అయిదు స్థానాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. డిల్లీ, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా లు వరసగా ఆ స్థానాలు ఆక్రమించాయి. పుండుమీద కారం చల్లినట్లు కిందనుంచి అయిదు స్థానాల్లో ఆంధ్ర ప్రదేశ్ నాలుగో స్థానం లో వుంది. తెలంగాణా జాతీయ సగటు కి దిగువలో వుంది. అంటే దీనర్ధమేంటి? వున్నత చదువులు కొద్దిమందికి మాత్రమే అందుబాటులో వున్నాయి. విస్తృత ప్రజానీకానికి అవి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేవు. కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానాలు మనకంటే ఎంతో ముందున్నాయి. మనం ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్ గడ్, బీహార్ సరసన ఉన్నాము. అటు అక్షరాస్యతలో గానీ, స్కూలు విద్యలోగానీ, వున్నత విద్యలోగానీ , కంప్యూటర్ వాడకంలో గానీ మన తెలుగు రాష్ట్రాలు ఇంతగా వెనకబడటం శోచనీయం. వీటిపై దృష్టి పెట్టే పరిపాలకులు మనకు కావాలి.

    కొంతమంది పరిశీలకులు ఈ సర్వే తప్పేమోననే సందేహం వెలిబుచ్చుతున్నారు. అది సరికాదు. 2011 జనాభా లెక్కలు ఒకసారి పరిశీలిస్తే అర్ధమవుతుంది. అప్పటి వుమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత లో వెనకబడి వుండటం యదార్ధమే. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు సవాలుగా తీసుకొని మిషన్ మోడ్ లో పనిచేసి అక్షరాస్యత లో విజయం సాధించారు. అదే మనం ప్రాంతాల గొడవలు, రాజకీయ గొడవలతో కాలం గడుపుతూ మరింత వెనక బడ్దాం. ఇది నిజం. ఈ నిజాన్ని ఒప్పుకొనే ధైర్యం లేక కుంటిసాకులతో సమర్ధించు కోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొని విద్యపై దృష్టి పెట్టి భవిష్యత్తు తరాలవారికి మేలుచేస్తారని ఆశించవచ్చా?