Krishnam Raju Smruti Vanam: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మృతీవనం నిర్మిస్తామని ప్రకటించింది. అయితే ఎప్పుడు ఇటువంటి వాటికి ముందుకు రాని జగన్ సర్కారు ఉన్నపలంగా కృష్ణంరాజుపై ప్రేమ ఒలకబోయడానికి చాలా కారణాలున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆపై క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు. అందుకే వారిని టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు క్షత్రియ సామాజికవర్గం వైసీపీకి మద్దతు తెలిపింది. మెజార్టీ వర్గాలు జగన్ కు అండగా నిలిచాయి. అందుకే ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు వైసీపీ తరుపున ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందారు.
అయితే గత మూడు సంవత్సరాలుగా జగన్ సర్కారు అనుసరించిన తీరుతో క్షత్రియ సామాజికవర్గం వైసీపీకి దూరమైంది. ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి దూరమయ్యారు. అటు తరువాత జరిగిన ఎపిసోడ్ లో రఘురామపై దాడి, పోలీసు కేసులు, సొంత నియోజకవర్గానికి రాకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు క్షత్రియ సామాజికవర్గంలో మార్పునకు కారణాలయ్యాయి. అటు విజయనగరం రాజులు పూసపాటి రాజవంశీయుడు అశోక్ గజపతిరాజు పై కక్ష సాధింపునకు దిగడం కూడా క్షత్రియ సామాజికవర్గానికి రుచించడం లేదు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నుంచి అశోక్ గజపతిరాజును తప్పించడం, రామతీర్థం రామస్వామి దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అశోక్ ను అవమానపరచడం.. ఇలా వరుస పరిణామ క్రమాలు క్షత్రియవర్గాన్ని వైసీపీకి దూరం చేశాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుంటారు.
Also Read: US Green Card: అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు?
అయితే దూరమైన క్షత్రియ సామాజికవర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకే కొత్తగా జగన్ సర్కారు కృష్ణంరాజు స్మృతీవనం ఏర్పాటుకు ముందుకొచ్చిందని క్షత్రియ సామాజికవర్గం పెద్దలు కూడా భావిస్తున్నారు. మూడున్నరేళ్లుగా అణగదొక్కి.. ఇప్పుడు స్మృతీవనంతో కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అటు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టింది. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక రాజకీయ ప్రయోజనాలుంటాయని.. రాజులను దరి చేర్చుకునేందుకే ఈ నిర్ణయమంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగం కామెంట్స్ ను ట్రోల్ చేస్తోంది.
దీనిపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా దీటుగానే స్పందిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ కు భారీగా స్మృతీవనం నిర్మించగా లేనిది కృష్ణంరాజుకు వద్దా అన్న స్లోగన్ బయటకు తీసింది. ఎన్టీఆర్ కంటే కృష్ణంరాజు ఏం తక్కువ అని ప్రశ్నిస్తోంది. కృష్ణంరాజు ఇష్యూను రాజకీయ లబ్ధి పొందేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ ఆరాటపడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read:PFI Ban- Turkey: పీఎఫ్ఐ ని భారత్ నిషేధిస్తే టర్కీ కి ఎందుకు ఇబ్బంది?