Chandrababu Arrest: చంద్రబాబుకు ఎట్టకేలకు స్వల్ప ఊరట దక్కింది. స్కిల్ స్కాంలో అరెస్ట్ అయినా ఆయన 43 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. న్యాయస్థానాల్లో ఆయనకు ఊరట దక్కడం లేదు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియడం లేదు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు నడుస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన తరచూ కలిసేందుకు లీగల్ ములాఖత్ లు అవసరమయ్యాయి. అనివార్యంగా మారాయి. కానీ రాజమండ్రి జైలు అధికారులు రోజుకు ఒక్కసారి మాత్రమే ములాఖత్ కి పరిమితం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి.
సాధారణంగా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడికి న్యాయ పోరాటానికి గాను రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ లకు అవకాశం ఇస్తారు. కానీ చంద్రబాబు విషయంలో న్యాయవాదులు తరచూ కలుస్తుండడంతో ఖైదీలు అసౌకర్యానికి గురవుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదో హై ప్రొఫైల్ కేసుగా పరిగణించి లీగల్ ములాఖత్ ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ములాఖత్ ల సంఖ్యను పెంచుతూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది.
తొలుత ములాఖత్ ల పెంపు అభ్యర్థనకు సంబంధించి పిటిషన్ లో ప్రతివాదుల్ని చేర్చకపోవడంపై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు నో చెప్పింది. అసలు ప్రతి వాదులే లేనిదానిపై ఏమని విచారణ చేయాలని ప్రశ్నించింది. దీంతో చంద్రబాబు తరుపు న్యాయవాదులు మరోసారి ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు రాక.. రోజుకు రెండుసార్లు చంద్రబాబును ఆయన తరుపు న్యాయవాదులు కలిసే అవకాశాన్ని కోర్టు కల్పించింది. దీంతో కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాబుకు స్వల్ప ఉపశమనం దక్కినట్లు అయ్యింది.